Site icon HashtagU Telugu

Gaddar : ఎట్టకేలకు గద్దర్ మృతిపై స్పందించిన మావోయిస్టు పార్టీ..

Maoist Party finally reacts on Gaddar and release a letter about Gaddar

Maoist Party finally reacts on Gaddar and release a letter about Gaddar

ప్రజా గాయకుడు, విప్లవ నేత గద్దర్(Gaddar) నిన్న మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం యావత్ తెలంగాణను విషాదంలో నింపింది. ఆయనకు అనేక మంది ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. హైదరాబాద్(Hyderabad) లో ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించి ఆయన స్కూల్ వద్దే అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు.

అయితే గద్దర్ మొదట మావోయిస్టు పార్టీలో పని చేసిన సంగతి తెలిసిందే. అడవి బాట పట్టి తన పాటలతో ఇంకెంతో మందిని అడవి బాట పట్టించి మావోయిస్టులతో కలిసి పోరాడాడు. మావోయిస్టుల్లో ఉన్నప్పుడు పోలిసులు గద్దర్ పై కాల్పులు కూడా చేశారు. కానీ ఒకానొక సమయంలో మావోయిస్టు విధానాలు నచ్చక అక్కడి నుంచి బయటకు వచ్చి జన జీవన స్రవంతిలో కలిసి తన పాటలతో ప్రజలని చైతన్యవంతులను చేస్తూ తెలంగాణ(Telangana) ఉద్యమంలో పాల్గొన్నారు.

నిన్నటి నుంచి కూడా గద్దర్ మరణంపై మావోయిస్టు పార్టీ స్పందించకపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఎట్టకేలకు గద్దర్ మృతిపై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఒక లేఖని విడుదల చేసింది. ఈ లేఖలో గద్దర్ గురించి తెలుపుతూ గద్దర్ మరణానికి సంతాపం ప్రకటించింది.

మావోయిస్టు పార్టీ గద్దర్ పై విడుదల చేసిన లేఖలో.. గద్దర్ మరణం రాష్ట్ర ప్రజలందరికి ఆవేదనను కలిగించింది. గద్దర్ అంటే దేశంలో, రాష్ట్రంలో తెలియని వారు వుండరు. గద్దర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతిని తెలియజేస్తున్నాము. నగ్జల్బరి, శ్రీకాకులం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు గద్దర్. పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను చైతన్య పరిచాడు. జన నాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి ఎంతో ఉంది. 1972 నుండి గద్దర్ విప్లవ ప్రస్థానం మొదలై 2012 వరకు కొనసాగింది. 4 దశబ్దాలు పీడిత ప్రజల ప్రక్షాన నిలబడ్డాడు. 1972 నుండి 2012 మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగాడు. మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా పని చేశాడు.

దోపిడి పాలకుల ఎన్ కౌంటర్లలో, బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లవ కారుల శవాలను తమ కుటుంబాలకు చేరకుండా చేసిన సందర్భంలో శవాల స్వాధీన ఉద్యమానికి నాయకత్వం వహించాడు. సాంస్కృతి రంగం యొక్క అవసరాన్ని పార్టీ గుర్తించి తనను బయటకు పంపి జన నాట్య మండలిని అభివృద్ధి చేసింది. 1997లో గదర్ పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కలిసి గద్దర్ పై కాల్పులు చేశారు. ఐదు తూటాలు శారీరంలో దూసుకెళ్ళి ప్రాణాపాయ స్థితి నుండి బయట పడ్డాడు. గద్దర్ చివరి కాలంలో పార్టీ నింబంధనావళికి విరుద్ధంగా పాలక పార్టీలతో కలువడంతో మా పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీంతో 2012లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. దాన్ని మా పార్టీ ఆమోదించింది. 2012 వరకు పీడిత ప్రజల పక్షాన నిలిచిన గద్దర్ ఆ తరువాత బూర్జువా పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నాడు అని తెలుపుతూ మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు.

 

Also Read : Gaddar Final Journey : గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం..