Manda Krishna Madiga : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈసందర్భంగా మందకృష్ణతో పాటు మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతరావు, మోత్కుపల్లి నర్సింహులు, పసునూరి దయాకర్ తదితరులు ఉన్నారు. ఈసందర్భంగా వారు సీఎం రేవంత్‌తో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరారు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గీకరణ కోసం తీర్మానం జరిగితే అన్ని పార్టీలు మద్దతిచ్చాయని ఈసందర్భంగా సీఎం రేవంత్‌కు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కూడా దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
అంతకుముందు బుధవారం రోజు మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు సపోర్టు చేసిన వారికి తన మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డికి గతంలో జరిగిన ఎన్నికల్లో మద్దతు ఇచ్చామని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు వల్లే తమకు మేలు జరిగిందని మందకృష్ణ మాదిగ చెప్పారు. ఇతర రాష్ట్రాల కంటే ముందే ఎస్సీ వర్గీకరణ ఆదేశాలను అమలు చేస్తామని చెప్పినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చట్ట సభలకు వెళ్లి గొంతెత్తాలని ఎవరికైనా ఉంటుందన్న మందకృష్ణ.. తాను 2004, 2009, 2014 సంవత్సరాల్లో ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
Also Read :Sheikh Hasina : షేక్ హసీనా, ‘అవామీ లీగ్’ ఎంపీలందరి రెడ్ పాస్‌పోర్ట్‌లు రద్దు.. ఎందుకు ?
‘‘సీఎం రేవంత్ రెడ్డిని నేను కొంత నమ్మగలను.. కానీ మల్లికార్జున ఖర్గేను నమ్మలేను. ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడుతున్నది ఆయనే’’ అని మందకృష్ణ మాదిగ బుధవారం ఉదయం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సోనియా, రాహుల్ ఎందుకు స్వాగతించలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలపై ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మందకృష్ణ మాదిగ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.