Man asks voters to return money : ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు కాళ్లావేళ్లా పడటం చూస్తుంటాం. మద్యం, బిర్యానీ, నగదు, చీరలు ఇలా ఆశామాయీగా పంపిణీ చేసి ఓట్లు దండుకోవాలని చూస్తారు. అయితే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. తాము గెలిపిస్తారని నమ్మి పంపిణీ చేసిన డబ్బులు, బహుమతులు ఇప్పుడు ఓడిపోయాక అభ్యర్థులు తిరిగి అడుగుతుండటం ఓటర్లను విస్మయానికి గురి చేస్తోంది. మేడ్చల్, మంచిర్యాల, భువనగిరి వంటి ప్రాంతాల్లో ఓడిపోయిన అభ్యర్థులు నేరుగా ఓటర్ల ఇళ్లకే వెళ్లి, “నాకు ఓటు వేయలేదు కాబట్టి, నేను ఇచ్చినవి తిరిగిచ్చేయండి” అని డిమాండ్ చేస్తుండటంతో గ్రామాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి.
ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మూడుచింతలపల్లిలో ఓ అభ్యర్థి తాను పంచిన చీరలు, నగదు, మద్యం ఖర్చును కూడా లెక్కగట్టి మరీ వసూలు చేస్తున్నారు. ఓడిపోయామన్న కోపంతో ఇంటింటికీ తిరిగి ఇచ్చినవి వెనక్కి తీసుకోవడం అక్కడ పెద్ద చర్చకు దారితీసింది. అలాగే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒక అభ్యర్థి అయితే ఏకంగా ఎవరు ఓటు వేశారు, ఎవరు వేయలేదనే లెక్కలు తీసి, ఓటు వేయని వారి దగ్గర బహుమతులను బలవంతంగా గుంజుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఓడిపోయిన ఒక అభ్యర్థి తాను పంచిన హాట్ బాక్సులు, చీరల కోసం జనం వెంట పడటం చూస్తుంటే ఎన్నికల వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్థమవుతోంది.
ఈ ఘటనలు ప్రజాస్వామ్యంలోని విలువలపై ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఓటును నోటుతో కొనాలని చూసిన అభ్యర్థులు, ఆశించిన ఫలితం రాకపోయేసరికి ఇలా “వసూల్ రాజా” అవతారమెత్తడంపై సామాన్యులు మండిపడుతున్నారు. “ఎన్నికలప్పుడు ఇచ్చేటప్పుడు ఆశ చూపించి, ఇప్పుడు వెనక్కి అడగడం ఏంటి?” అని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఓటుకు వేలం వేసి కొనుగోలు చేసే సంస్కృతి పెరిగిపోవడంతో, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇలాంటి ‘లొల్లి’లు తప్పడం లేదు. ఈ వింత ధోరణి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్ అవుతోంది.
