Mallu Bhatti Vikramarka: తాము విడుదల చేసిన శ్వేతపత్రంలో ఎలాంటి తప్పులు లేవని భట్టి స్పష్టం చేశారు. గత బడ్జెట్ లెక్కలు, ఆర్‌బీఐ, కాగ్‌ల నుంచి సేకరించిన వివరాలతో నివేదికను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తమకు శత్రువులు కాదని, ప్రత్యర్థులు మాత్రమేనని అన్నారు. ఆంధ్రాకు చెందిన రిటైర్డ్ అధికారులతో శ్వేతపత్రం సిద్ధం చేశామన్న హరీశ్ రావు మాటలు సరికాదన్నారు. తెలంగాణ అధికారులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా అధికారులతో శ్వేతపత్రం సిద్ధం చేయాల్సిన అవసరం మాకు లేదు. సర్వీసులో ఉన్న తెలంగాణ అధికారులు చాలా నిష్ణాతులు. వారితో ఈ నివేదిక తయారు చేశాం. తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్‌లపై మీకు నమ్మకం లేకపోతే ఆంధ్రా కేడర్ అధికారులను పిలిచి సీఎస్, డీజీపీ పోస్టులు ఇచ్చారు. వారిని సలహాదారులుగా నియమించారు అని విమర్శించారు.
2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ హయాంలో రూపొందించిన వార్షిక బడ్జెట్‌లన్నీ వాస్తవాలకు దూరంగా ఉన్నాయని భట్టి అన్నారు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. బడ్జెట్‌లో ఎక్కడైనా అంచనాలకు, వ్యయానికి మధ్య 5 శాతం తేడా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ఇచ్చే బడ్జెట్లలో కేటాయింపులు, ఖర్చుల మధ్య 20 శాతానికి పైగా వ్యత్యాసం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేశామన్నారు.
రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ (ఓవర్ డ్రాఫ్ట్)పై ఆధారపడాల్సిన పరిస్థితిని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని భట్టి మండిపడ్డారు. ఈ పరిస్థితి దురదృష్టకరమని భావిస్తున్నట్లు తెలిపారు. దశాబ్ద కాలంగా సాగుతున్న ఆర్థిక అరాచకాలు, తప్పిదాలను రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు, కలలు నెరవేరేలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అందరికీ తెలియజేస్తున్నారు.
Also Read: Bigg Boss7: బిగ్ బాస్ పై హైకోర్టుకు సిపిఐ నారాయణ లేఖ