హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూత్రపిండాల సంబంధిత వ్యాధితో (కిడ్నీ డిసీజ్) ఆయన సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు. గత నాలుగు నెలలుగా ఆయన ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
Bangalore : తొక్కిసలాట ఘటన.. సాయం ప్రకటించిన ఆర్సీబీ
ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకపోవడంతో, వైద్యులు ప్రత్యేకంగా ఆయన్ని పర్యవేక్షిస్తున్నారు. కీలకమైన అవయవాల స్పందనను నిరంతరం గమనిస్తూ అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడనిప్పటికీ, ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు ఎంతో దగ్గరైన నేతగా గుర్తింపు పొందారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ, ప్రజల మద్ధతును సంపాదించుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.