తెలంగాణలో పునరుత్పాదక శక్తి రంగంలో మరో కీలక ముందడుగు పడింది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో కూడిన 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను కేంద్రం ఆమోదించడంతో రాష్ట్రం దేశవ్యాప్తంగా పెద్ద దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఇప్పటివరకు ఆమోదింపబడిన అతిపెద్ద BESS ఆధారిత సోలార్ ప్రాజెక్ట్ కావడం ప్రత్యేకత. ఈ ప్రాజెక్ట్ అమలు ద్వారా రాష్ట్రానికి స్వచ్ఛమైన, స్థిరమైన విద్యుత్ సరఫరా లభించడమే కాకుండా, దేశవ్యాప్తంగా పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించడంలో తెలంగాణ కీలక పాత్ర పోషించనుంది.
Karumuri Venkata Reddy : వైసీపీ నేత అరెస్ట్..కారణం ఆ వ్యాఖ్యలు చేయడమే !!
మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ మెగా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుండగా, దీనికి సంబంధించి ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి ఇప్పటికే జీఓ విడుదల చేశారు. BESS వ్యవస్థ వల్ల సూర్యకాంతి లేని సమయాల్లో కూడా విద్యుత్ నిల్వ చేసి సరఫరా చేయడం సాధ్యమవుతుంది. దీంతో విద్యుత్ డిమాండ్‌లో వచ్చే ఒడిదుడుకులు తగ్గి, గ్రిడ్ స్థిరత్వం మరింత బలోపేతం అవుతుంది. ఇటువంటి హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేసే పవర్ ప్లాంట్లు ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాధాన్యం పొందుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఇలాంటి భారీ ప్రయత్నం శాస్వత శక్తి వినియోగంలో మైలురాయిగా నిలుస్తుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను యూనిట్‌కు కేవలం రూ. 2.90 ధరకే TGGENCO అందుకోనుంది. ఇది సాధారణ సౌర విద్యుత్ యూనిట్ ధరతో పోలిస్తే చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది భారీ ఆర్థిక లాభాన్ని అందించడంతో పాటు పరిశ్రమలు, వ్యవసాయం, గృహ వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం కూడా తగ్గే అవకాశముంది. ఇదే తరహా ప్రాజెక్టులను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కూడా వేగంగా అభివృద్ధి చేస్తుండగా, తెలంగాణలో ఈ కొత్త ప్రాజెక్ట్ రాష్ట్రాన్ని పునరుత్పాదక శక్తి రంగంలో ముందంజలో నిలబెడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
