Gift Deeds : ‘గిఫ్ట్‌ డీడ్లు’ రాసిచ్చేస్తున్న భూ యజమానులు.. కారణాలు ఇవీ

2020 సంవత్సరానికి ముందు తెలంగాణలో ప్రతి సంవత్సరం దాదాపు  80 వేల గిఫ్టు డీడ్‌లు(Gift Deeds) రిజిస్ట్రేషన్‌ అయ్యేవి.

Published By: HashtagU Telugu Desk
Gift Deeds Land Owners Family Members

Gift Deeds : వ్యవసాయ భూములు కలిగినవారు గిఫ్ట్‌ డీడ్‌‌లను రాసిచ్చే ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అంటే.. ప్రాపర్టీని కానుకగా ఇచ్చేయడం అన్న మాట. ప్రాపర్టీ యజమానులు తమ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ఆస్తిని గిఫ్టుగా రాసి ఇవ్వొచ్చు. ఇది చాలా ఈజీ ప్రక్రియ. గిఫ్ట్‌ డీడ్‌‌లను రాసిచ్చే ట్రెండ్ పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read :Thackeray Scoreboard : ఎన్నికల బరిలో ముగ్గురు ‘థాక్రే’ వారసులు.. ఫలితాలు ఇలా

  • 2020 సంవత్సరానికి ముందు తెలంగాణలో ప్రతి సంవత్సరం దాదాపు  80 వేల గిఫ్టు డీడ్‌లు(Gift Deeds) రిజిస్ట్రేషన్‌ అయ్యేవి. ఆ తర్వాతి నుంచి ఏటా లక్షకుపైనే గిఫ్టు డీడ్‌ల రిజిస్ట్రేషన్ జరుగుతోంది.
  • గిఫ్టు డీడ్‌లను రిజిస్ట్రేషన్ చేయిస్తున్న వారిలో అత్యధికులు వ్యవసాయ భూముల యజమానులే ఉంటున్నారు.
  • ప్రభుత్వం అమలు చేసే రైతు బీమా పథకం నుంచి లబ్ధి పొందే ఉద్దేశంతో కొంతమంది  గిఫ్ట్‌ డీడ్‌లను తమ వారసుల పేరిట రాస్తున్నారు. రైతు బీమా పథకం కింద ఏ ప్రమాదంలో రైతు ప్రాణం పోయినా రూ.5 లక్షల దాకా పరిహారం లభిస్తుంది.
  •  గిఫ్టు డీడ్‌ల ద్వారా చాలా ఈజీగా ఆస్తి హక్కులను బదిలీ చేయొచ్చు. ఈ కారణం వల్ల కూడా దీన్ని వాడేందుకు చాలామంది ఆస్తిపరులు ఆసక్తి చూపిస్తున్నారు.
  • గిఫ్టు డీడ్‌ కాకుండా ఇతరత్రా పద్ధతుల్లో ఆస్తి పంపకాలను చేయాలని భావిస్తే..  రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ల కోసం కొనుగోలు చేసేవారు, అమ్మేవారితో పాటు నలుగురు సాక్షులు ప్రత్యక్షంగా హాజరు కావాలి.  ఇక గిఫ్ట్‌ డీడ్‌ ప్రక్రియలో భూయజమాని, దాన్ని బహుమతిగా పొందబోయే వ్యక్తి, ఇద్దరు సాక్షులు ఉంటే సరిపోతుంది.
  • ధరణి పోర్టల్‌ ద్వారా జరుగుతున్న ఆస్తుల లావాదేవీల్లో గిఫ్ట్‌ డీడ్‌కు భూమి మార్కెట్‌ విలువపై 3 శాతం ఛార్జీని వసూలు చేస్తున్నారు.
  • బ్యాంకు పూచీకత్తులు వంటి వాటికి గిఫ్టు డీడ్‌లు కీలకంగా మారాయి. అందుకే తమ వారసులకు వాటిని అందించి ఆర్థికంగా ఎదగడానికి సాయం  చేస్తున్నారు. చాలామంది గిఫ్టు డీడ్‌లను బ్యాంకు పూచీకత్తులుగా వాడుకొని రుణాలను పొంది వ్యాపారాలను విస్తరించుకుంటున్నారు.
  • ఆస్తి బదిలీ చట్టం ప్రకారం ఒకసారి ఆస్తిని గిఫ్టు డీడ్ ద్వారా బదిలీ చేసిన తర్వాత.. సాధారణ పరిస్థితులలో దాన్ని రద్దు చేయడం అనేది సాధ్యపడదు. గిఫ్టు డీడ్‌ను రాసేవారు  ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా కారణం వల్ల దాన్ని తిరిగి తీసుకోవాలని భావిస్తే.. ఆవిషయాన్ని డీడ్‌లో వివరంగా ప్రస్తావించాలి. అప్పుడే సదరు ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు లభిస్తుంది.

Also Read :AMRUT Tenders : కేటీఆర్‌‌‌కు మరో షాక్.. నాంపల్లి స్పెషల్ కోర్టులో వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి పిటిషన్

  Last Updated: 23 Nov 2024, 05:41 PM IST