Site icon HashtagU Telugu

Yadadri Temple: తెలంగాణ ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామి దర్శనం జన్మజన్మల పుణ్యఫలం

68

68

తెలంగాణ ఇలవేల్పు. భక్తులపాలిట కొంగుబంగారం. ప్రతీ సంవత్సరం కుటుంబమంతా కనీసం ఒక్కసారైనా యాదగిరిగుట్టకు వెళ్లి ఆ భగవంతుడిని దర్శించుకోవడం తెలంగాణ ప్రజలకు అలవాటు. ఇప్పుడు గుడి పునర్నిర్మాణంతో కొత్త శోభను సంతరించుకుంది. పూర్తిగా కృష్ణశిలలతోనే నిర్మాణమైంది. శిల్పకళను చూడడానికి రెండు కళ్లూ చాలవు. దాదాపు ఆరేళ్లయ్యింది.. ఆ లక్ష్మీనరసింహుడి స్వయంభూ దర్శనాన్ని చేసుకుని. ఇప్పుడు మహాకుంభ సంప్రోక్షణ తరువాత మళ్లీ భక్తులకు మామూలు దర్శనం మొదలైంది.

వెలుగులు విరజిమ్ముతున్న యాదాద్రి ఆలయాన్ని చూసి భక్తులు తన్మయత్వంతో పులకిస్తున్నారు. తిరుమలలో వెంకన్న స్వామిని రోజూ దాదాపు 50 వేల మంది భక్తులు.. పర్వదినాల్లో రోజూ 70-80 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. వారికి సరిపడా వసతులను ఏర్పాటుచేశారు. అలాగే.. యాదాద్రిలోనూ రోజూ 50 వేల మంది భక్తులు దర్శించుకున్నా సరే.. ఎవరికీ ఏ లోటూ రాకుండా ఏర్పాట్లు చేశారు. గత ఆరేళ్ల లెక్కలు చూసినా సరే.. బాలాలయంలో కొలువుదీరిన నరసింహస్వామిని రోజూ దాదాపు 8 వేల మంది దర్శించుకున్నారు. అదే సెలవురోజుల్లో అయితే ఈ సంఖ్య 30-40 వేల వరకు ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశముంది.

17వ శతాబ్దం తరువాత రాతి నిర్మాణాలే కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు రెండున్నర లక్షల టన్నుల కృష్ణ శిలలతో యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దారు. దీనికోసం 1200 మంది శిల్పులు కష్టడ్డారు. ఇంటర్ లాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి.. ఇక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే.. ఏమీ కాకుండా 1000 ఏళ్లపాటు ఆలయం నిలిచి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

యాదాద్రి ఆలయాన్ని పరిశీలిస్తే.. రాజుల కాలం నాటి నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఆలయ ప్రాకారంలో ఏర్పాటు చేసిన అష్టభుజి మండపాల వల్ల రథయాత్ర సమయంలోనూ భక్తులు వాటిలో కూర్చుని చూడవచ్చు. ఈ ఆలయంలో ముఖ మండపం ఎత్తు 38 అడుగులు. దీనికి ఆధారంగా ఉండేలా 11 అడుగుల ఎత్తుతో 12 మంది ఆళ్వార్ల రాతి శిల్పాలు ఇందులో చెక్కారు. ఇలా ఒకటా రెండా.. ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలను అందిస్తాయి. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు రూ.1200 కోట్లు ఖర్చయ్యింది.