Kukatpally Sahasra Case : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన కూకట్‌పల్లి చిన్నారి సహస్ర హత్య కేసులో విస్మయపరిచే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పదేళ్ల బాలికను కేవలం ఒక చిన్న వివాదం కారణంగా అత్యంత క్రూరంగా 27 సార్లు కత్తిపోట్లు చేసి హత్య చేసిన నిందితుడు, ఆ హత్య చేసిన కొన్ని నిమిషాలకే తన పెంపుడు కుందేలుపై చూపిన ప్రేమ, జాలి పోలీసులనే షాక్‌కు గురిచేస్తోంది. ఒకవైపు అమాయక చిన్నారిని దారుణంగా పొడిచి చంపిన వ్యక్తి, మరోవైపు ప్రాణం కోసం తపనపడుతున్న ఒక జంతువును ఆదుకోవడానికి ప్రాణప్రయత్నం చేయడం – ఈ రెండు పరస్పర విరుద్ధ కోణాలు దర్యాప్తు దిశను కొత్త మలుపు తిప్పుతున్నాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బ్యాట్ దొంగతనం చేస్తూ సహస్ర తనను పట్టుకోవడంతో ఆగ్రహానికి లోనైన బాలుడు కత్తి తీసి ఆమెను వరుసగా పొడిచి అక్కడికక్కడే చంపేశాడు. ఆ ఘోర నేరం అనంతరం క్షణం కూడా జంకకుండా గోడ దూకి ఇంటికి చేరుకున్నాడు. ఒంటిపై రక్తపు మరకలు కుటుంబ సభ్యులకు కనిపించకుండా బట్టలు మార్చుకున్నాడు. అదే సమయంలో, అనారోగ్యంతో ఉన్న తన పెంపుడు కుందేలును పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ, ఆ రోజు సాయంత్రానికే ఆ కుందేలు చనిపోయింది.
Nara Lokesh : చట్టం ముందు దోషిగా నిలవక తప్పదు.. జగన్ కు లోకేశ్ కౌంటర్
హత్య చేసిన క్షణాల్లోనూ ఎలాంటి భయం, గందరగోళం లేకుండా ప్రవర్తించడం, పోలీసులు విచారణకు సహకరించడం, కుందేలుపై చూపిన సానుభూతి – ఇవన్నీ అతని వ్యక్తిత్వం ద్వంద్వ స్వరూపాన్ని సూచిస్తున్నాయని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితుడి కుటుంబ పరిస్థితులు కూడా దర్యాప్తులో కీలక అంశంగా మారాయి. తల్లి ఒక్కరే ఇంటి భారం మోస్తున్న పరిస్థితుల్లో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో బాలుడు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం, కుందేలు వంటి పెంపుడు జంతువును సంరక్షించడం ఎలా సాధ్యమైందన్నదే ఇప్పుడు అధికారులను ఆలోచనలో పడేసింది. డబ్బుల వనరులపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
అలాగే, పాఠశాలలో తరచూ సహాధ్యాయులు తనను “బక్కగా ఉన్నావు” అంటూ బాడీ షేమింగ్ చేయడం, దాంతో అతడు ఒంటరిగా మిగిలిపోవడం, సమయమంతా యూట్యూబ్‌లో క్రైమ్ వెబ్ సిరీస్‌లు, హింసాత్మక వీడియోలు చూడడం కూడా అతని మనసుపై తీవ్ర ప్రభావం చూపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోర్టు అనుమతితో బాలుడిని పోలీసులు కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. అతని మానసిక స్థితి, కుందేలు వ్యవహారం, స్మార్ట్‌ఫోన్ కొనుగోలు వెనుక ఆర్థిక వనరులు, క్రైమ్ వెబ్ సిరీస్‌ల ప్రభావం వంటి అంశాలను మరింత లోతుగా పరిశీలించాలని యోచిస్తున్నారు. ఇకపై ఈ కేసు దిశ నిందితుడి మానసిక స్థితి అధ్యయనంపైనే ఆధారపడే అవకాశం ఉందని, హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, దాని మానసిక, సామాజిక కోణాలను విశ్లేషించాలని అధికారులు భావిస్తున్నారు.
Amaravati : ఏపీ మీదుగా రెండు బుల్లెట్ రైలు కారిడార్లకు ప్రాథమిక ఆమోదం