KTR: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ క్యాంపులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 3 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై అనిరుధ్ అనే విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. అనిరుధ్ కుటుంబం నివసిస్తున్న గ్రామానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు(సోమవారం) వెళ్లారు. అక్కడ విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుమారుడు పోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు.
We’re now on WhatsApp. Click to Join.
అనిరుధ్ మరణం ముమ్మాటికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో వివిధ పాఠశాలల్లో ఇప్పటి వరకు 36 మంది చనిపోయారని ఆయన అన్నారు. “గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మంచిచెడులు చూసుకునే వారు కరవయ్యారు. ఎన్నికలు ఇంకో 4 ఏళ్ల తరువాత ఉన్నాయి. ఈ అంశంపై మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. వీలైతే కుటుంబానికో ఉద్యోగం ఇవ్వాలి. విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ అధ్యయనానికి కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన బృందం ఏర్పాటు చేస్తాం. ఈ బృందం ఓ రిపోర్ట్‌ను తయారు చేస్తుంది. దాన్ని ప్రభుత్వానికి అందజేస్తాం. కేవలం 8 నెలల కాలంలో 500 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. ప్రభుత్వం ఇకనైనా మేలు కోవాలి, అన్ని పాఠశాల ఆవరణలు వెంటనే శుభ్రపరచాలి. బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేయాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
LIVE : BRS Working President @KTRBRS speaking to media after visiting Peddapur Gurukul student's family https://t.co/UGiXy9lat3
— BRS Party (@BRSparty) August 12, 2024
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఎలమాడల అనిరుధ్ (11), జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన మొండి మోక్షిత్ గురుకులంలో ఆరోతరగతి చదువుతున్నారు. వీరిద్దరూ గురువారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి సమయంలో వారిద్దరూ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో పీఈటీ వెళ్లగా.. కడుపు నొప్పిగా ఉందని అనిరుధ్, మోక్షిత్‌లు తెలిపారు. దీంతో వెంటనే కేర్‌టేకర్‌లు, అనిరుధ్ తల్లికి ఫోన్‌లో సమాచారం ఇచ్చి వారిని కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అనంతరం విషమంగా ఉందని తెలపడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ఆస్పతికి తీసుకెళ్లారు. అప్పటికే విషయం తెలిసి వైద్యుడు కూడా అయిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్.. విద్యార్థులు పాము కాటుకు గురై ఉండవచ్చని అందుకు తగిన వైద్యం చేయాలని ఆర్మూర్‌లో వైద్యులకు సూచించారు.
అక్కడ వైద్యం అందించి నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అనిరుధ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాఠశాలలో ప్రార్థనా సమయంలోనే ఆరో తరగతి చదువుతున్న హేమంత్ అనే మరో విద్యార్థి కూడా కళ్లు తిరుగుతున్నాయని కింద పడిపోయాడు. గమనించిన ఉపాధ్యాయులు మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.