భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (KTR) సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేపట్టబోతున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోనే తాము ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కన్నెపల్లి పంప్ హౌస్ అంశంపై ప్రభుత్వం రాజకీయం చేస్తోందని, ఉద్దేశపూర్వకంగానే నీరివ్వకుండా లక్షల ఎకరాల పంటలను ఎండబెట్టేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ పేరును వాడుకుంటూ కొందరు నష్టం కలిగించాలని చూస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను అస్సలు సహించేది లేదని హెచ్చరించారు.
ఈ పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే కాకుండా, ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ వ్యాప్తంగా సాగబోయే ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో వేచి చూడాలి.
