Site icon HashtagU Telugu

Minister KTR: వర్షాలు తగ్గడంతో కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్

Minister KTR

New Web Story Copy (86)

Minister KTR: రాష్ట్రంలో భారీ వర్షాల నేసథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కాగా శుక్రవారం, శనివారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తదనంతరం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లతో కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాల పైన ప్రధానంగా అధికారులతో చర్చించారు ప్రస్తుతం ఉన్న సహాయ కార్యక్రమాలను సవాలుగా తీసుకొని మరింత నిబద్ధతతో పనిచేయాలని కేటీఆర్ అన్నారు. అందుకోసం ఎలాంటి సహాయానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేటీఆర్ చెప్పారు. సహాయ కార్యక్రమాల్లో ఇతర శాఖలతోనూ సమన్వయం చేసుకొని ముందుకు పోవాలన్నారు. వర్షాల సమయంలో సంబంధిత ప్రభుత్వ అధికారులకు సెలవులను రద్దు చేసినట్టు గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు.

పట్టణాల్లో ఉన్న చెరువులు పూర్తిగా నిండాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి, అవసరమైతే సాగునీటి శాఖతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు వాటిని కొంత ఖాళీ చేయించాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఎలాంటి అవసరం ఉన్నా స్వయంగా నా కార్యాలయంతో పాటు పురపాలక శాఖ ఉన్నతాధికారులంతా అందుబాటులో ఉంటారని చెప్పారు కేటీఆర్. సమన్వయం కోసం హైదరాబాద్ తో పాటు ప్రతి జిల్లాలో కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పట్టణాల్లో ప్రధాన రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలి. అవసరమైతే అదనపు సిబ్బందిని, అదనపు వాహనాలను సమకూర్చుకోవాలని సూచించారు.బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్, దోమల నివారణ మందుల పిచికారి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని కోరారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీరును అందించాలి. ప్రజలు తాగునీటిని కాచి వడపోసుకొని వినియోగించాలని అవగాహన వచ్చే చర్యలు తీసుకోవాలి. సురక్షిత తాగునీరు సరఫరా కోసం మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకొని పైపులైన్ల లీకేజీలు వెంటనే మరమ్మతులు చేయడము, తాగునీటి క్లోరినేషన్ వంటి కార్యక్రమాలను వేగంగా చేపట్టాలని అధికారులతో చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పట్టణాల్లో ఉన్న బస్తీ దావఖానాలు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి సంస్థల సహకారంతో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

Also Read: Celebrities Deaths: టాలీవుడ్ దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ మృతి