Flyover Accident: బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ ఘటనపై విచారణ!

బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ ర్యాంప్‌ కూలిన ఘటనలో గాయపడిన బాధితులు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Flyover Accident: బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ ర్యాంప్‌ కూలిన ఘటనలో గాయపడిన బాధితులు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు బుధవారం తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ ర్యాంప్‌లో కొంత భాగం కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక ఇంజనీర్ మరియు ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. గాయపడినవారు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌కు చెందినవారుగా తెలుస్తుంది. వీరిలో నలుగురిని రోహిత్ కుమార్, పునీత్ కుమార్, శంకర్ లాల్, జితేందర్‌లుగా గుర్తించారు. ట్రాఫిక్ కూడలిలో ఫ్లైఓవర్ నిర్మిస్తున్న సాగర్ రింగ్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లర్లపై స్లాబ్‌లు వేయడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. దీంతో కేటీఆర్ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. కేటీఆర్ తో పాటు మంత్రి తలసాని కూడా ఉన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ఎంఏ అండ్ యూడీ విభాగం పూర్తిస్థాయి విచారణ జరుపుతుందని అన్నారు. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను వెలికితీస్తుందని తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. ఎల్‌బీ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… కార్మికులు స్లాబ్‌ వేస్తుండగా చిన్నపాటి స్ట్రెచ్ కూలిపోయిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్లైఓవర్ పనులు ఇంకా కొనసాగుతున్నందున నాణ్యత లేని కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోలేమని ఏసీపీ తెలిపారు. ఇక సంఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చుహాన్‌, ఎల్‌బీనగర్‌ డీసీపీ సాయిశ్రీలు సందర్శించారు.

Read More: Indigo Flight: ఇండిగో విమానం ఇంజన్ ఫెయిల్.. అత్యవసర ల్యాండింగ్ చేసిన లోకో పైలెట్?