Delhi : కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కలిశారు. ఈ మేరకు ఢిల్లీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి జాతీయ రహదారి విస్తరణపై విజ్ఞప్తి చేశారు. రహదారుల అభివృద్ధికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంపిన ప్రతిపాదనల గురించి వివరించారు. అలాగే జాతీయ రహదారులను పొడిగించాలని కోరారు. నేషనల్ హైవే 368బీ సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు ఉన్న ప్రపోజల్‌ను వేములవాడ నుంచి కోరుట్ల వరకు విస్తరించాలని గడ్కరీని కేటీఆర్ కోరారు.
Read Also: Hardik Pandya: నా టాలెంట్ రోహిత్ కు బాగా తెలుసు: హార్దిక్
విస్తరణ వల్ల ఈ రహదారి వెంబడి ఉన్న తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు వేములవాడ, కొండగట్టు, ధర్మపురి మరింత అనుసంధానమవుతాయని వివరించారు. అలాగే, నేషనల్ హైవే 63కి అనుసంధానం వీలు అవుతుందని చెప్పారు. సూర్యాపేట నుండి సిరిసిల్ల వరకు జాతీయ రహదారి 368బీని నిర్మిస్తున్నారు. ఈ ప్రపోజల్‌ను వేములవాడ నుండి కోరుట్ల వరకు విస్తరించాలని.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. దీనికి సంబంధించి గతంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలు పంపారని కేటీఆర్ కేంద్రమంత్రికి వివరించారు.
మానేరు నదిపై రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నిర్మించాలని గడ్కరీని కోరారు. ఈ ప్రతిపాదనలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి తదితరులు ఉన్నారు. కాగ, 2017లోనే సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు హైవే నిర్మించాలని ప్రతిపాదనలు పంపారు. జనగామ, సిద్దిపేట మీదుగా సిరిసిల్ల నుంచి కామారెడ్డి జాతీయ రహదారిని కలుపుతూ రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.