జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరి(Pradeep Chowdhury)తో పాటు పలువురు వివిధ పార్టీల నేతలు ఎమ్మెల్సీ ఎల్.రమణ (Ramana) ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన ఆయన, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని, ఏ ఎన్నిక వచ్చినా ఎదుర్కొనే సత్తా బీఆర్‌ఎస్‌కే ఉందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే గల్లీ స్థాయి ఎన్నికైనా, ఢిల్లీ స్థాయి ఎన్నికైనా బీఆర్‌ఎస్‌కు అనుకూలమేనని స్పష్టమవుతోందని ఆయన అన్నారు.
Election Commission : తెలంగాణల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ ..!
కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. రైతులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలకూ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తీరని ఆయన అన్నారు. ఈ మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకు ‘బాకీ కార్డులు’ అనే ఉద్యమాన్ని బీఆర్‌ఎస్ చేపట్టిందని, ఇవి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తాయని చెప్పారు. ఈ కార్డులు కాంగ్రెస్‌కే బ్రహ్మాస్త్రంలా మారతాయని కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలో బీఆర్‌ఎస్ హయాంలో సాధించిన అభివృద్ధి, పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మనసుల్లో నిలిచాయని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌ను అధికారంలోకి తెచ్చుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరత, పెన్షన్‌ల మోసం, యువతకు ఉద్యోగాలు లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి మాత్రం మున్సిపల్ శాఖ మంత్రిగా విఫలమై కనీసం నగరాన్ని శుభ్రం చేయలేకపోతూ, కొత్త నగరాలను కడతానని పోజులు కొడుతున్నారని ఆయన విమర్శించారు. ఒకప్పుడు దేశంలో తెలుగువాడి గౌరవాన్ని ఎన్టీఆర్ నిరూపించగా, తెలంగాణవారి శక్తిని కేసీఆర్ నిరూపించారని కేటీఆర్ పేర్కొంటూ, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ సునామీలా విస్తరిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.