తెలంగాణ (Telangana) రాష్ట్రానికి నీటి వనరులు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కృష్ణా నదీ జలాల అంశం (Krishna River Water Issue) మరోసారి వివాదాస్పదంగా మారింది. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను ఏపీ తరలించుకుంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో విమర్శించారు. గత మూడు నెలలుగా సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ రోజుకు 10 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తోందని, అయినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) ఏపీ తరఫున పనిచేస్తోందని స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు తాగునీరు, సాగునీరు సరఫరా అందించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై మౌనం వహించడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. తెలంగాణలోని రైతులు నీటి ఎద్దడితో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
30 Thousand Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో మూడేళ్లలో 30వేల మందికి ఉద్యోగాలు!
కేసీఆర్ పాలనలో ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వినియోగించి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వ్యవసాయ రంగం కష్టాల్లో పడిపోయిందని ఆరోపించారు. ఈ తేడాను ప్రజలు గమనించాలని, తెలంగాణ రైతులు మళ్లీ నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సూచించారు. వేసవి కాలం దగ్గరపడుతున్న వేళ, తాగునీరు, సాగునీరు సమస్య తీవ్రతరం అవుతుందన్న విషయం ప్రభుత్వానికి తెలియదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ట్రిప్పులు వేస్తూ గడిపేస్తున్నారే తప్ప, తెలంగాణ రైతుల కష్టాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతులకు పూర్తి న్యాయం చేయాలని, కృష్ణా జలాలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై తెలంగాణ రైతులు మేల్కొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. “జాగో రైతున్న జాగో.. జాగో తెలంగాణ జాగో..” అంటూ రైతాంగాన్ని ఆందోళనకు సిద్ధం కావాలని కోరారు. ఒకప్పుడు నీటి కోసం ఉద్యమించిన తెలంగాణ, ఇప్పుడు అదే సమస్యను మళ్లీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమన్నారు.