కేంద్ర బడ్జెట్ 2025(Union Budget 2025)పై మాజీ మంత్రి & బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను పూర్తిగా పక్కన పెట్టినట్లు ఆయన ఆరోపించారు. గతంలో వాగ్దానమైన ప్రాజెక్టులపైనా, కొత్త కేటాయింపులపైనా తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు భారీ నిధులు కేటాయించగా, తెలంగాణ ప్రస్తావన చేయకపోవడం అన్యాయమన్నారు. తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ఎదురుచూసినా, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కనీస ప్రాధాన్యత లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఐఐటీ, ఐఐఎం, ఐసర్, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐడీ వంటి విద్యాసంస్థల కేటాయింపులు లేకపోవడం విద్యార్థులు, తల్లిదండ్రులకు తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి విద్యా సంస్థలు పెంచుతూ, తెలంగాణను విస్మరించడంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
Champions Trophy: ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టనున్న భారత్
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా వంటి విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని ఆయన గుర్తుచేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులు కేటాయించి, తెలంగాణలో బయ్యారం ఉక్కు పరిశ్రమను విస్మరించడం దారుణమన్నారు. తెలంగాణను పక్కన పెట్టే బీజేపీ విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. భవిష్యత్‌లో ఈ విధానానికి ప్రజలు గట్టి సమాధానం చెబుతారంటూ హెచ్చరించారు. సమాఖ్య స్ఫూర్తిని కించపరిచే విధంగా, దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూడడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.