హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్ (Gulzar House Fire Accident)లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తెలంగాణను కుదిపేసింది. ఈ ఘటనలో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన నేపథ్యంలో, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ ప్రమాదంపై స్పందించిన కేటీఆర్, ఇలాంటి ఘటనలు మరలా జరగకూడదన్నదే ప్రభుత్వాల ధ్యేయంగా ఉండాలన్నారు. చార్మినార్ వంటి జన ప్రాంతాల్లో ఉన్న భద్రతా లోపాలను ప్రభుత్వం గమనించాలని కోరారు.
ఇదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ, ఘటన జరిగిన వెంటనే ఆయనే అక్కడికి వచ్చి ఉంటే సహాయక చర్యలు మరింత వేగంగా జరిగేవి అని పేర్కొన్నారు. ప్రభుత్వం అందాల పోటీలకు ఖర్చు పెట్టడం కంటే ప్రజల ప్రాణాలను రక్షించే చర్యలపై దృష్టి పెట్టాలన్నారు. అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు తక్కువగా ఉన్నాయని, కనీసం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమయానికి ఫైర్ ఇంజిన్లకు నీరు లేకపోవడం, అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేని కారణంగా బాధితులు మరణించారని ఆరోపించారు.
ప్రమాదానికి కారణాలపై చేపట్టిన ప్రాథమిక విచారణలో ఏసీ పేలక, షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం ప్రారంభమైందని అధికారులు నిర్ధారించారు. చెక్క ప్యానెళ్లు, ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం, వెంటిలేషన్ సరిగా లేకపోవడం ఈ ఘోరానికి దారితీసిన ముఖ్య కారణాలుగా చెబుతున్నారు. ఇల్లు పెద్దదైనప్పటికీ ఒక్కటే బయటకు వెళ్లే మార్గం ఉండటం, లోపల ఇరుగుపొరుగు ఉండటం వల్లే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువైందని వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉండటం కూడా ప్రమాద తీవ్రతను పెంచింది. ఈ విషాద ఘటనపై ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.