Khammam : కాంగ్రెస్ శ్రేణుల రాళ్ల దాడిని ఖండించిన కేటీఆర్

ప్రజలకు సేవ చేయడం చేతకాదని.. సేవ చేసేవారిపై మాత్రం దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ దాడికి సీఎం సహా కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు

Published By: HashtagU Telugu Desk
Ktr Kmm

Ktr Kmm

ఖమ్మంలో మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish rao) వాహనంపై కాంగ్రెస్ శ్రేణుల రాళ్ల దాడిని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ఖండించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్‌ అసహనానికి నిదర్శనమని, ప్రజలకు మీరు సాయం చేయరు.. చేస్తున్న వారిని చూసి ఓర్వలేక దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే.. బాధితులకు అండగా నిలబడడం తప్పా అంటూ ప్రశ్నించారు.

ప్రజలకు సేవ చేయడం చేతకాదని.. సేవ చేసేవారిపై మాత్రం దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ దాడికి సీఎం సహా కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా సరే ప్రజల వద్దకు బీఆర్‌ఎస్‌ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరన్నారు. కాంగ్రెస్‌ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు మహోగ్రరూపం దాల్చింది. వరద ఉధృతికి నగరంలోని కవిరాజ్‌నగర్‌, వీడియోస్‌ కాలనీ, కోర్టు ప్రాంతం, ఖానాపురం హవేలీ, మమత హాస్పిటల్‌ రోడ్డు, కాల్వ ఒడ్డు.. దాదాపు పదుల సంఖ్యలో కాలనీ లు నీటమునిగాయి. నడుముల్లోతు నీరు చేరడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం, వరద ఎప్పుడూ చూడలేదన్నారు స్థానికులు. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడం జనాలు బయటకు వస్తున్నారు. అలాగే అధికార , ప్రతిపక్ష పార్టీల నేతలు బాధితులను పరామర్శిస్తున్నారు.

నిన్న సీఎం రేవంత్ రెడ్డి నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించగా..ఈరోజు బిఆర్ఎస్ నేతలు వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కారులో హరీశ్ రావు, సబితా, నామా నాగేశ్వరరావు ఉన్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మంచికంటి న‌గ‌ర్‌లో బీఆర్ఎస్ నేత‌లు ప‌ర్య‌టిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాంగ్రెస్ శ్రేణుల దాడిలో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త సంతోష్ రెడ్డికి తీవ్ర గాయాల‌య్యాయి. అత‌న్ని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Read Also : Sleeping : నిద్ర -గుండె జబ్బుల మధ్య సంబంధం ఏమిటి? తాజా అధ్యయనం కీలక విషయాలు..!

  Last Updated: 03 Sep 2024, 04:46 PM IST