Site icon HashtagU Telugu

KTR : అలా నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా : పొంగులేటికి కేటీఆర్‌ సవాల్‌

KTR challenge to Ponguleti Srinivas Reddy

KTR challenge to Ponguleti Srinivas Reddy

KTR vs Ponguleti: అమృత్ పథకం టెండర్ల వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆదివారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. అమృత్ పథకం టెండర్లలో ఎలాంటి తప్పులు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు. ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వయిరీ చేయిద్దాం. సిట్టింగ్ జడ్జి గనుక ఇందులో తప్పులు ఎం జరగలేదు అంటే.. నేను రాజకీయ సన్యాసం చేస్తా’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైకోర్టు సీజే దగ్గరికి రాడానికి మంత్రిగారికి ఇబ్బంది ఉంది అంటే డేట్, టైం ఫిక్స్ చేయండి ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి పోదామని అన్నారు.

చిత్తశుద్ధి ఉంటే.. హైకోర్టు సీజే దగ్గరకు మంత్రి పొంగులేటి తనతో రావాలి..

ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలని మంత్రి, ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుందన్నారు. భార్య సోదరుడు బావమరిది కాకుండా ఏమవుతారని ప్రశ్నించారు. చట్టాలే కాదు.. చుట్టరికాలు కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లుందని అన్నారు. ఫోర్త్ సిటీ కాదు.. ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అంటూ ఎద్దేవా చేశారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తమకు ఎక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా? అని ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్ కథ సహా.. సీఎం రేవంత్ కుటుంబ అవినీతిని తేలుస్తామన్నారు. బావమరిది వ్యవహారంలో ఇరికిపోయాడని సీఎంకు కూడా తెలుసన్నారు. చిత్తశుద్ధి ఉంటే.. హైకోర్టు సీజే దగ్గరకు మంత్రి పొంగులేటి తనతో రావాలని, టెండర్లలో తప్పులేమీ జరగలేదంటే.. రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. సీఎం ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని టెండర్లు రద్దు చేయాలన్నారు.

సింగరేణిని కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ వెన్నుపోటు..

మరోవైపు, బీఆర్‌ఎస్‌ పాలనలో సింగరేణి అద్భుత ప్రగతి సాధించిందన్నారు కేటీఆర్‌. పదేళ్లలో సింగరేణి లాభాలు గణనీయంగా పెరిగాయన్నారు. లాభాల్లో కార్మికుల వాటా పెంచుకుంటూ వచ్చామని చెప్పారు. లాభాలను వెయ్యి కోట్లు దాటించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదే. తొమ్మిదిన్నరేండ్లలో తాము రూ.2,780 కోట్లు ఇచ్చామని కార్మికులకు ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. 2022-23లో సింగరేణి లాభాల్లో కార్మికులకు 32 శాతం వాటా ఇచ్చామని, సగటున ఒక్కో కార్మికుడికి రూ.లక్షా 60 వేలు చెల్లించామని కేటీఆర్ తెలిపారు. సింగరేణిని, కార్మికులను ముఖ్యమంత్రి రేవంత్ వెన్నుపోటు పూడుస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్‌ సర్కార్‌ దోచుకుంటోందన్నారు. 33 శాతం వాటా ఇస్తున్నామని సీఎం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి లాభాలు రూ.4701 కోట్లు అయితే 33 శాతం వాటా ఇచ్చామంటున్నారు. అలా అయితే, కార్మికులకు రూ.1551 కోట్లు బోనస్‌ ఇవ్వాలి. ఒక్కో కార్మికుడికి రూ.3.70 లక్షలు రావాలి.. కానీ, రూ.లక్షా 90 వేలు మాత్రమే ఇస్తున్నారని కేటీఆర్ వివరించారు.

16 శాతం మాత్రమే బోనస్ ఇస్తున్నామని కాంగ్రెస్‌ ఒప్పుకోవాలన్నారు. లేదంటే లక్షా 90వేలు కాదు.. రూ. 3.70 లక్షల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. సింగరేణి కార్మికుల వాటా తగ్గింపుపై గుర్తింపు సంఘం ఏఐసీయూసీ స్పందించాలన్నారు. కూనంనేని సాంబశివరావు తన అభిప్రాయం చెప్పాలన్నారు. వాటా పెంచాలని కార్మికులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసి ఒత్తిడి చేయాలన్నారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ చెప్పారు.

Read Also: Janasena : 26న పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్న బాలినేని..