Site icon HashtagU Telugu

Hydraa : హైడ్రా బాధితులకు అండగా బిఆర్ఎస్

Ktr Hydraa

Ktr Hydraa

‘హైడ్రా’ (Hydra )..ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో మారుమోగిపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల యజమానులకు నిద్ర లేకుండా చేస్తుంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. చెరువులు, బఫర్ జోన్స్, ఎఫ్ టీఎల్, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తుంది హైడ్రా. నిబంధనలకు విరుద్దంగా స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను బుల్డోజర్లతో పడగొడుతున్నది. హైడ్రా చర్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అయితే హైడ్రా కూల్చివేతలకు మొదట్లో పలు వర్గాల నుంచి మద్దతు లభించినప్పటికీ..ప్రస్తుతం మాత్రం పూర్తి వ్యతిరేకత వస్తుంది.

పొలిటికల్ లీడర్స్ , సంపన్నులకు నోటీసులు ఇస్తూ..ఖాళీ చేసేందుకు టైం ఇస్తున్న హైడ్రా..సామాన్య ప్రజల వద్దకు వచ్చేసరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తుందని..కనీసం ఇంట్లో సామాన్లు తీసుకెళ్తామన్న కూడా కుదరదంటూ కూల్చేస్తూ తమను రోడ్డు మీదకు లాగుతున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వమే అన్ని పర్మిషన్లు ఇచ్చి..డబ్బు తీసుకోని మళ్లీ అదే ప్రభుత్వం అక్రమ నిర్మాణమని కూల్చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ముందే అది అక్రమ నిర్మాణమని చెపితే మీము కొనుగోలు చేయం కదా..లక్షలు..లక్షలు బ్యాంకు లోన్లు తెరుచుకొని , ఇల్లు కట్టుకుంటే..ఇప్పుడు ఆ ఇంటిని కూల్చేస్తే ఆ లోన్ లు ఎలా కట్టుకోవాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. దీనిపై విపక్ష పార్టీలు సైతం ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. హైడ్రా కూల్చివేతలు అన్యాయమంటూ ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాజకీయాలకు, రాగ ద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేయండని కోరారు. ‘ఆక్రమణలు మేము కూడా ప్రోత్సహించం కానీ అభాగ్యులకు అండగా నిలుస్తాం. ఇల్లు కూల్చివేసేటప్పుడు చిన్న పిల్లలు, మహిళలకు రోడ్డు మీద పడేయకుండా.. మరో నివాసాన్ని ఏర్పాటు చేసి అక్కడకు తరలించండి. ఈ కూల్చివేతల సమయంలో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు, మహిళలని చూడకుండా ఇంట్లో నుండి బయటకు గెంటేస్తున్నారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే వాళ్లను వెండింగ్‌ జోన్లు ఏర్పాటు చేసి తరలించాలి. ఉన్నపళంగా ఉపాధి కోల్పోతే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి. ’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.

పేదలు, మధ్య తరగతి నిర్మించుకున్న నివాసాలపై ప్రతాపం చూపడం సరికాదని, ఎల్టీఎఫ్, బఫర్ జోన్లు అని తెలిసి కూడా వాటికి అనమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘ఇది కాంగ్రెస్ సర్కార్ చేయాల్సిన చర్య ఇది కాదు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. మానవీయత లేకుండా పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారు. బాధితులకు వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి లేదా ప్రత్యామ్నాయ పరిష్కారం చూపించి.. అప్పుడు కూల్చివేయాలి. హైడ్రా బాధితులందరికీ.. న్యాయపరంగా సాయం అందిస్తాం. మా పార్టీ తరుఫున, మా లీగల్ సెల్ అండగా నిలుస్తుంది. ఎవరికీ ఏ ఇబ్బంది ఉన్నా.. బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి రండి. తప్పకుండా బాధితులకు న్యాయం చేస్తాం. లేదంటే.. నగరంలో బీఆర్ఎస్ శాసన సభ్యుల దృష్టికి సమస్యను తీసుకు రండి.. న్యాయ పరంగా మీకు అండగా నిలుస్తాం. హైడ్రా బాధిత పేదలు కస్తూరిబాయి, వేదశ్రీ కుటుంబాలను పరామర్శిస్తాం. మంచి ఉద్దేశంతో పనిచేస్తే ప్రభుత్వానికి సహకరిస్తాం. శని, ఆదివారాల్లో జరుగుతున్న కూల్చివేతలను హైకోర్టు సూమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

Read Also : YCP Leaders : జనసేన లోకి ‘జగనే’ నేతలను పంపిస్తున్నాడా..?