KTR : ఎమ్మెల్యే రోహిత్‌కు చెప్పుదెబ్బ లాంటి సమాధానం ఇచ్చిన బీఆర్ఎస్ కార్యకర్త మేకల నర్సింగరావుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. నర్సింగ్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ, పోలీస్ సిబ్బందిని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఇలాంటి వాళ్లను గుర్తుపెట్టుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి పోలీసులపై అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టడంతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మెదక్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మేకల నర్సింగరావుకు పార్టీ సంపూర్ణ భరోసా ఇస్తుందని, అండగా నిలుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మెదక్ స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తన చిన్న వయస్సును మరచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన అడ్డగోలు వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇచ్చిన నర్సింగ్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
Also Read :Tanda Gangs : తెలుగు రాష్ట్రాల్లో టాండా దొంగలు.. ఎవరు ?
ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడిస్తూ హింసించారు
‘‘పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎవరైనా దూషిస్తే ఊరుకునేది లేదని.. దూషించేవాడు ఎమ్మెల్యే అయినా, ఎవ్వరైనా గట్టిగా సమాధానం చెబుతామని ప్రపంచానికి నర్సింగ్ చాటిచెప్పాడు. ఒక సాధారణ కార్యకర్త అయినా పార్టీ ప్రతిష్ఠను చాటాడు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలకు నర్సింగ్ స్ఫూర్తిప్రదాత. తన వయసును మరచి నీచంగా మాట్లాడిన మైనంపల్లి రోహిత్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన నర్సింగ్‌ను.. మెదక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఇతర పోలీసులు అక్రమంగా స్టేషనుకు తీసుకెళ్లారు. నర్సింగ్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడిస్తూ హింసించారు. ఇలా చేయడం సరికాదు’’ అని కేటీఆర్(KTR) మండిపడ్డారు.
Also Read :Maoist Hidma : కర్రెగుట్టల్లోకి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళం ?
నర్సింగ్ కుటుంబానికి మేం అండగా ఉంటాం
అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగే అధికారులను వదిలిపెట్టేది లేదని, వీరి అరాచకాలపై కోర్టులో కేసులు వేసి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని కేటీఆర్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి అరాచకాలు చేసిన వారిపై తగిన చర్యలు ఉంటాయన్నారు. వీరందరి పేర్లను రాసుకుని మరీ గుర్తుంచుకుంటున్నామని కేటీఆర్ వెల్లడించారు. నర్సింగ్ లాంటి నిబద్ధత కలిగిన పదిమంది కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో ఉంటే కాంగ్రెస్ కుట్రలు సాగవన్నారు. థర్డ్ డిగ్రీ వల్ల నర్సింగ్‌కు జరిగిన గాయాలకు తగిన వైద్య సహాయం పార్టీ అందిస్తుందన్నారు. నర్సింగ్, ఆయన కుటుంబానికి పూర్తి అండగా నిలుస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.