KTR Acting CM: కేసీఆర్ స్కెచ్.. యాక్టింగ్ సీఎంగా కేటీఆర్!

ఇటు ఐటీ మంత్రిగా, అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ రెండు పాత్రల్లో సమర్థవంతమైన బాధ్యతను నిర్వర్తిస్తూ తనదైన మార్క్ వేస్తున్నారు.

  • Written By:
  • Updated On - February 7, 2023 / 01:05 PM IST

కేటీఆర్.. (KTR) తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఇటు ఐటీ మంత్రిగా, అటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా రెండు పాత్రల్లో సమర్థవంతమైన బాధ్యతను నిర్వర్తిస్తూ తనదైన మార్క్ వేస్తున్నారు. పాలనలో, వారసత్వంలో తండ్రి (CM KCR) ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే లీడర్. అయితే గత కొంతకాలంగా ఈ యువరాజు (KTR)కి ముఖ్యమంత్రి పీఠం అందని ద్రాక్షలా మారిన విషయం తెలిసిందే. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు కేవలం కేటీఆర్ కు మాత్రమే ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల మాట కూడా. అయితే ఈ యువరాజు పట్టాభిషేకం గురించి తరచుగా మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. యువరాజుకు పట్లాభిషేకం ఎప్పుడు? కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠం దక్కేనా? అనే వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి కేటీఆర్ (KTR) ప్రస్తావన చర్చనీయాంశమవుతోంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నప్పటికీ.. యాక్టింగ్ సీఎం (Acting CM)గా మంత్రి కేటీఆర్ ఎంతో కాలంగా వ్యవహరిస్తున్నారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. నిజానికి ఏడాదిన్నర క్రితం ఒకసారి ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పట్టాభిషేకం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగం సిద్ధం చేసి.. అధికారికంగా ప్రకటించేందుకు తయారవుతున్న వేళ.. అనూహ్యంగా ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటం తెలిసిందే. కట్ చేస్తే.. మళ్లీ అలాంటి సీన్ తాజాగా వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకు ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలే (Assembly Meetings) నిదర్శనంగా చెబుతున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు బదులుగా మంత్రి కేటీఆర్ చేత మాట్లాడించటం హాట్ టాపిక్ గా మారింది. తన తర్వాత తన రాజకీయ వారసుడు కేటీఆర్ అన్న విషయాన్ని ఇప్పటికే తేల్చేసిన కేసీఆర్.. తన ముఖ్యమంత్రి పదవిని కొడుక్కి అప్పగించేందుకు సిద్ధమవుతున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది.

దీనికి కారణం.. సాధారణంగా గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రే ప్రసంగించాల్సి ఉంటుంది. చాలా అరుదుగా.. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం శాసన సభా వ్యవహారాల మంత్రి సమాధానం చెబుతారు. తాజాగా చూస్తే.. ప్రత్యేక పరిస్థితులు ఏమీ లేకున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రసంగించకుండా.. తన కొడుకు కేటీఆర్ చేత ప్రసంగించేలా చేయటం చూస్తే.. తన తర్వాత ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను చేసేందుకు రంగం సిద్ధమవుతుందన్న విషయాన్ని ఆయన చెప్పేసినట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది.

షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దానికంటే ముందుగానే ఎన్నికలు జరిగే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒకపక్క ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు అదేమీ లేదు షెడ్యూల్ (Shedule) ప్రకారమే జరుగుతాయన్న వాదనను వినిపిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం వెళతారా? ముందస్తుకు వెళతారన్న దానిపై సందిగ్థత కొనసాగుతున్నప్పటికీ… తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ (BRS) విస్తరణపై గురి పెట్టిన నేపథ్యంలో, ఏపీలో పార్టీ పగ్గాలు తోటకు అప్పజెప్పిన క్రమంలో కేటీఆర్ పట్టాభిషేకం మరోసారి తెలంగాణ (Telangana)లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Pathaan beats Bahubali: బాహుబలి రికార్డ్స్ ను బద్ధలుకొట్టిన పఠాన్!