Karimnagar CP : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మధ్య సాగుతున్న వివాదం ఇప్పుడు ‘వీడియో లీలల’ హెచ్చరికలతో పతాక స్థాయికి చేరింది. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీపీ తన అధికారాన్ని అడ్డగోలుగా వాడుకుంటున్నారని, ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత అవసరాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా, ఒక ఐఆర్ఎస్ అధికారి కుటుంబ సభ్యుల కోసం కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక ఇన్నోవా క్రిస్టా కారును, ఇద్దరు కానిస్టేబుళ్లను హైదరాబాద్‌లో కేటాయించారని పేర్కొన్నారు. గత ఎనిమిది నెలలుగా ఆ వాహనం నిమ్స్ ఆసుపత్రికి సివిలియన్లను చేరవేసేందుకు వాడుతున్నారని, డీజీపీ కార్యాలయం సమీపంలోనే ఇది జరుగుతున్నా డీజీపీ శివధర్ రెడ్డికి ఎందుకు తెలియడం లేదని ఆయన నిలదీశారు.
‘లీలల వీడియోలు’.. కౌశిక్ రెడ్డి డెడ్ లైన్
కేవలం వాహనాల దుర్వినియోగమే కాకుండా, సీపీ గౌస్ ఆలం వ్యక్తిగత ప్రవర్తన మరియు ఆర్థిక లావాదేవీలపై కూడా కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీకి సంబంధించిన “లీలల వీడియోలు”, యాంటీ ఛాంబర్‌లో జరిగిన దృశ్యాలు, మరియు హైదరాబాద్ రిసార్ట్స్‌లో జరిగిన రహస్య భేటీలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తన వద్ద ఉన్నాయని ఆయన బాంబు పేల్చారు. ఇది కేవలం ‘ట్రైలర్’ మాత్రమేనని, 15 రోజుల్లోగా చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ వీడియోలన్నింటినీ బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. ఐపీఎస్ అధికారులపై ఉన్న గౌరవంతోనే ఇప్పటివరకు ఆగానని, కానీ అవినీతి మరియు అక్రమ పనులను సహించబోనని స్పష్టం చేశారు.
అసెంబ్లీ వేదికగా పోరాటం.. ప్రభుత్వానికి డిమాండ్
ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి సీపీపై చర్యలు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా ఆ వీడియో సాక్ష్యాధారాలను చూపిస్తానని, అప్పటికీ న్యాయం జరగకపోతే మీడియా పాయింట్ వద్ద ప్రజల ముందు పెడతానని భీష్మించారు. ఒకరిద్దరు అధికారుల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు రాకూడదని ఆయన హితవు పలికారు. ఈ హెచ్చరికలు ఇప్పుడు పోలీసు వర్గాల్లో మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.
