Nagarjuna: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna), తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి శుభం కార్డు పడింది. మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాను ఆయన ఉపసంహరించుకున్నారు. మంత్రి సురేఖ తన మునుపటి వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ బహిరంగంగా ప్రకటన చేయడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాప ప్రకటన
తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు తెలియజేస్తూ మంత్రి కొండా సురేఖ నిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. నాగార్జున, వారి కుటుంబం పట్ల తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆమె స్పష్టం చేశారు. ఆమె తన ప్రకటనలో “నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారిని ఇబ్బందిపెట్టాలని కానీ, వారి పరువు-ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది కానీ నా ఉద్దేశం కాదు. నాగార్జున కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా” అని స్పష్టంగా పేర్కొన్నారు.
Also Read: Schools: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవు!
దావా ఉపసంహరణకు నాగార్జున నిర్ణయం
మంత్రి కొండా సురేఖ చేసిన పశ్చాత్తాప ప్రకటన, వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంపై నటుడు నాగార్జున సానుకూలంగా స్పందించారు. ఈ ప్రకటన అనంతరం మంత్రిపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసును ఉపసంహరించుకుంటున్నట్టు నాగార్జున అధికారికంగా ప్రకటించారు.
వ్యక్తిగత విమర్శలు, రాజకీయ వ్యాఖ్యల కారణంగా ఈ వివాదం మొదలైన సంగతి తెలిసిందే. మంత్రి చేసిన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని నాగార్జున భావించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఇద్దరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఈ వివాదం చివరకు సయోధ్యతో ముగియడంపై సినీ మరియు రాజకీయ వర్గాలలో హర్షం వ్యక్తమవుతోంది.
