Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించడంతో, ఇందుకు మంత్రి కొండా సురేఖ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీనే బీజేపీ విజయానికి కారకుడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన ఆమె, ‘‘మీ మోదీ అంకుల్ గెలుపులో కీలక పాత్ర పోషించిన మీ సోదరి కవితను ముందుగా అభినందించండి’’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం, ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్, ‘‘బీజేపీ విజయానికి కృషి చేసిన అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీ’’ అంటూ విమర్శలు చేశారు. ఆయన నాయకత్వ లోపమే కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా తీవ్ర పరాజయాలకు గురి చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పటిష్టంగా ఉండి ఉంటే, దేశంలో బీజేపీకి పోటీగా నిలిచేదని, కానీ రాహుల్ నాయకత్వంలో ఆ పార్టీ మరింత దిగజారిపోతోందని వ్యాఖ్యానించారు.
Health Tips: రోజులో ఎంత నీరు త్రాగాలి?.. సద్గురు ఏం చెప్పారంటే?
కొండా సురేఖ కౌంటర్: ముందు మీ సోదరి గురించి మాట్లాడండి
కేటీఆర్ విమర్శలకు గట్టిగా బదులిచ్చిన మంత్రి కొండా సురేఖ, ‘‘రాహుల్ గాంధీకి బుద్ధి చెప్పాలంటూ వ్యాఖ్యలు చేసే ముందు, మీ ఇంట్లోనే నిజాన్ని అంగీకరించండి. 2019లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మీ సోదరి కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోలేదా? కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ గెలవడానికి కారణం ఎవరు? ఇది మర్చిపోయారా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
‘‘మీ కుటుంబానికి రాహుల్ గాంధీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి ఇచ్చాడు. మీరు అదే రాహుల్‌ను విమర్శిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సున్నాతో తుడిచిపెట్టుకుపోయిందని మరిచిపోయారా? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా భయపడుతోంది’’ అంటూ ఘాటుగా స్పందించారు.
‘‘రాహుల్ గాంధీ ప్రభావాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. కనీసం ఆయనను గౌరవించండి. నిజంగా అర్హులైన వారిని అభినందించడం నేర్చుకోండి. ఇకనైనా ‘నెక్ట్స్ టైమ్ బెటర్ లక్’ అని కేటీఆర్ గారు చెప్పుకోవచ్చు’’ అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉధృతం అవుతుండగా, కేటీఆర్ – కొండా సురేఖ మధ్య మాటల తూటాలు మరింత వేడెక్కిస్తున్నాయి. మరి దీనికి కేటీఆర్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Pakistan- India: ఫిబ్రవరి 23న బిగ్ ఫైట్.. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఎవరిది పైచేయి?