Komatireddy Rajgopal Reddy: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “రాబోయే పదేండ్లూ నేనే ముఖ్యమంత్రి” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ విలువలకు, నైతిక ఆచారాలకు విరుద్ధమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మలచాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఓ జాతీయ పార్టీగా ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరిస్తుందని, అధిష్ఠానం నిర్ణయమే తుది అయితుందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఒక నేత పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని స్వయంగా ప్రకటించుకోవడం పార్టీ అంతర్గత విధానాలకు వ్యతిరేకం. ఇది మిగతా నాయకులే కాక, కార్యకర్తల నమ్మకాన్ని క్షీణింపజేస్తుంది అంటూ కోమటిరెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను… pic.twitter.com/nGtGpQzgGk— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 19, 2025
నిన్న కొల్లాపూర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ నీ గుండెల మీద రాసుకో… 2024 నుంచి 2034 వరకూ పాలమూరు బిడ్డ సీఎం అవుతాడు. పాలమూరు నుంచే శాసనం చేస్తా. పాలమూరు నుంచే ప్రజాప్రభుత్వాన్ని నడుపుతా అని ప్రకటించారు. ఈ మాటలు కాంగ్రెస్ పార్టీలోపలే పలువురు నేతల్లో అసంతృప్తికి దారితీశాయి. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డికి స్థానం దక్కకపోవడం, పార్టీ అధిష్ఠానంపై ఆయన అసహనం వ్యక్తం చేయడం వంటివి ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ పరిణామాలకు సంకేతాలుగా భావిస్తున్నారు. ఇటీవలే కోమటిరెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ, “తన దారి తాను చూసుకుంటా” అని ప్రకటన చేయడం కూడా ఈ సంక్షోభాన్ని మరింత ఉధృతం చేసింది.
రేవంత్ రెడ్డి తరచూ మీడియా వేదికలపై, బహిరంగ సభల్లో తానే మరోసారి సీఎం అవుతానని ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు పార్టీలోని సీనియర్ నేతల అసంతృప్తికి దారి తీయడం తాజా ఉదాహరణే. పార్టీ సంప్రదాయాలకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉన్న నేతగా ఉండాల్సిన రేవంత్ రెడ్డి, ఇలా వ్యక్తిగత నాయకత్వాన్ని ప్రమోట్ చేయడంపై కోమటిరెడ్డితో పాటు మరికొందరు నేతలూ మౌనంగా ఉన్నప్పటికీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్షోభం నేపధ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏ స్థాయికి దారితీస్తాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక కీలక దశ కావడంతో, పార్టీలో సామరస్యాన్ని పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నట్లు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఓవరాల్ గా రాజగోపాల్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టడం ఇప్పుడు అనేక చర్చలకు దారితీస్తుంది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రాజగోపాల్..ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా సీఎం పైనే ఆగ్రహం వ్యక్తం చేయడం తో రాజగోపాల్ నెక్స్ట్ ఏంచేయబోతున్నాడు అంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా చర్చ మొదలైంది.
Read Also: Gold Rate : నేటి బంగారం ధరలు ఇవే… ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం…