Vivek -Rajagopal Reddy : ఇద్దరు కీలక నేతలు తెలంగాణ బీజేపీకి షాక్ ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ మళ్లీ తమ సొంతగూడు కాంగ్రెస్ కు చేరుకుంటారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అటు రాజగోపాల్ రెడ్డి కానీ.. ఇటు వివేక్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మంగళవారం రోజు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వీరిద్దరూ హస్తం పార్టీతో చెయ్యి కలిపే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతారని అంచనా వేస్తున్నారు. దీనిపై తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
రాజగోపాల్‌రెడ్డి ఏమన్నారంటే.. ?
ఈ ప్రచారంపై రాజగోపాల్‌రెడ్డి స్పందిస్తూ.. ‘‘ కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ పార్టీలో చేరాలన్న ఒత్తిడి ప్రజల నుంచి నాపై పెరుగుతోంది’’ అని వెల్లడించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తుల్లో భాగంగా మునుగోడు నుంచి ఒకవేళ సీపీఐ బరిలోకి దిగితే.. తాను స్వయంగా అక్కడ పోటీ చేస్తానని రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బరిలోకి దిగితే.. తాను ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేస్తానని, తన భార్యకు మునుగోడు టికెట్ ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి అడిగినట్లు సమాచారం. అయితే మునుగోడు నుంచే పోటీ చేయాలని, వేరే టికెట్ ఇచ్చేది లేదని బీజేపీ నాయకత్వం ఆయనకు స్పష్టం చేసిందని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
వివేక్ వెంకటస్వామి బీజేపీ తరఫున చెన్నూరు, ధర్మపురి అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని భావించారట. చివరకు ఆయన ధర్మపురి అసెంబ్లీ స్థానం కావాలని బీజేపీని డిమాండ్ చేశారట. కానీ తొలి జాబితాలో ధర్మపురి అసెంబ్లీ స్థానం నుంచి ఎస్. కుమార్ ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఆయన ఇక కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడమే బెటర్ అనరే అభిప్రాయానికి వచ్చారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ఎల్బీ నగర్ నుంచి, వివేక్ ధర్మపురి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం నడుస్తోంది. ఇందులో ఏది ఎంత నిజం అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.