Site icon HashtagU Telugu

BRS : ఎర్రవల్లిలో కీలక చర్చలు..భవిష్యత్ వ్యూహంపై కేసీఆర్, హరీష్ రావు మంతనాలు

Key discussions in Erravalli.. KCR, Harish Rao discuss future strategy

Key discussions in Erravalli.. KCR, Harish Rao discuss future strategy

BRS : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ మళ్లీ తెలంగాణ రాజకీయ కేంద్రబిందువుగా మారింది. ఆదివారం నాడు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో కలిసి ఒక కీలక భేటీ నిర్వహించారు. ఇది ఆ పార్టీ ఆవిష్కరించబోయే భవిష్యత్ మార్గసూచిపై ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం ఫామ్ హౌస్ మూడవ అంతస్తులో దాదాపు రెండు గంటలపాటు సాగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇది కేవలం సాధారణ సమాలోచన కాదని, పార్టీలో ఇటీవల ఏర్పడిన అంతర్గత పరిణామాలపై లోతుగా చర్చించిన సమావేశమని సమాచారం.

Read Also: Bigg Boss: బిగ్‌బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు.. ట్రంప్‌పై పరోక్ష విమర్శలేనా?

ఇటీవల ఎమ్మెల్సీ కవితపై వస్తున్న విమర్శలు, హరీష్ రావుపై భిన్న స్వరాలు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ఆడిట్ నివేదికలు తెచ్చిన దుమారం ఇవన్నీ సమావేశంలో ముఖ్య చర్చాంశాలుగా నిలిచినట్లు తెలుస్తోంది. పార్టీలో నాయకత్వం పై భిన్నాభిప్రాయాలు, స్థానిక ఎన్నికల వ్యూహాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ భేటీలో గమనార్హ విషయం ఏంటంటే బీఆర్ఎస్ లో ఇతర కీలక నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించకపోవడమే. కొంత కాలంగా ఫామ్ హౌస్ నుంచే కేటీఆర్ రాజకీయ పరిణామాలను సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఆయన వారం రోజులుగా అక్కడే తిష్టవేశారని తెలిసింది. సమావేశం అనంతరం ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ, ఈ చర్చలు పార్టీకి కొత్త దిశను సూచించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ సమావేశం ద్వారా నేతల మధ్య సమన్వయాన్ని పటిష్టం చేయడం, బీఆర్ఎస్ పునర్నిర్మాణానికి బేస్ సిద్ధం చేయడం అనే ఉద్దేశంతో రహస్య చర్చలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే, పార్టీకి ప్రజల్లో మళ్లీ విశ్వాసం కల్పించడానికి అవసరమైన మార్గాలను, పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను కూడా ఈ భేటీలో చర్చించి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో పార్టీ నాయకత్వ మార్పులు, రాజకీయ ఆహ్వానాలు, కీలక నిర్ణయాల బాటలో ఈ సమావేశం ఒక మైలురాయి కావొచ్చని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పునఃఉజ్జీవనానికి ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్, ఎటువంటి దిశలో పయనిస్తుందో వేచి చూడాల్సిందే.

Read Also: Modi Manipur : ఎట్టకేలకు మణిపుర్ కు ప్రధాని మోదీ?