తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్‌ను గవర్నర్ విష్ణుదేవ్ వర్మ కేంద్ర హోంశాఖకు పంపించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆర్డినెన్స్‌లను గవర్నర్ ఆమోదించాల్సిన బాధ్యత ఉంది. అయితే కొన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో గవర్నర్, కేంద్ర హోంశాఖ న్యాయ సలహాను కోరవచ్చు. ఇదే మేరకు అడ్వకేట్ జనరల్, న్యాయనిపుణులతో చర్చల అనంతరం గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రేపటితో (జూలై 25)గా రిజర్వేషన్ల ఖరారుకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ స్పందన ఎంత త్వరగా వస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఒకవేళ కేంద్రం నుంచి 24 గంటల్లో నిర్ణయం రాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగేందుకు రెండు మార్గాలు మాత్రమే ఉంటాయి. హైకోర్టును ఆశ్రయించి మరింత గడువు కోరడం లేదా పాత రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగించడం. ఈ రెండు మార్గాల్లో ఏదైనా తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఆధారపడి ఉంది.
Tragedy : ఘోరం.. మల్టీ మిలియనీర్ CEOను తొక్కి చంపిన ఏనుగు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న హామీతో ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి సర్కార్. ఈ అంశంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటనలు చేసింది. ఈ విషయంలో కేంద్రం నుంచి సహకారం లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని చికాకులో పడేసింది. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అలాగే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ రఘునందన్ రావు లాంటి నాయకులు మతరాజకీయ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీనివల్ల కేంద్రం వైఖరి ఇంకా అనిశ్చితంగా ఉంది.
ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత లేకపోవడం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని పెంచుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా మారిన తరుణంలో, కేంద్ర–రాష్ట్రాల మధ్య సంయమితంగా చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. లేదంటే రిజర్వేషన్ల విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రజాప్రతినిధి సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం కావడం తథ్యం. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.