తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నేతృత్వంలో పార్టీకి చెందిన నేతలను మూడు విభాగాలుగా విభజించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీని ప్రకారం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న వారు ఒక గ్రూప్‌గా ఉంటారు. ఎన్నికల ముందు పార్టీకి వచ్చి నేటికి కీలక పాత్ర పోషిస్తున్న వారు రెండో గ్రూప్‌గా గుర్తింపు పొందనున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీకి చేరిన వారిని మూడో గ్రూప్‌గా వర్గీకరించనున్నారు. ఈ విభజన వల్ల పార్టీ అంతర్గత వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్‌లో చేరిన కొత్త నాయకులు, ప్రత్యేకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారు, పార్టీలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పాత కాంగ్రెస్ నేతలకు, కొత్తగా పార్టీలో చేరిన వారికి సముచితమైన ప్రాధాన్యత ఇస్తూ, అంతర్గత అసంతృప్తిని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Jagan : ‘కోడి కత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ ‘ – మంత్రి మనోహర్
కేటగిరీల ఆధారంగా నాయకులకు నామినేటెడ్ పదవులు, కీలక బాద్యతలు అప్పగించే అవకాశం ఉంది. గతంలోనే కొన్ని పార్టీల్లో నేతల విభజన, జూనియర్, సీనియర్ నేతల మధ్య సామరస్యతలో సమస్యలు తలెత్తాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈ విభజన ద్వారా అందరికీ సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించిన సీనియర్ నేతలు తగిన గుర్తింపు పొందాలని, కొత్త నాయకులు కూడా సమానమైన అవకాశాలు పొందాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయాలపై గమనించాల్సిన అవసరం ఉంది. విభజన ప్రక్రియ సజావుగా కొనసాగితే, నేతల మధ్య సమతుల్యత నెలకొని పార్టీ బలోపేతమవుతుంది. అయితే గ్రూపుల మధ్య పోటీ పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. విభజన ప్రక్రియ సుదీర్ఘకాలంగా కొనసాగితే, అది అసంతృప్తికి దారి తీసే అవకాశం కూడా ఉంది. అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర నాయకత్వం మరి ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.