KCR National Politics: కేసీఆర్ జాతీయ స్థాయి ముచ్చట మర్చిపోవాల్సిందేనా?

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ ని తీవ్రంగా నిరాశకు గురి చేశాయి. ఆ ఎఫెక్ట్ ద్వారా కేసీఆర్ రెండు నెలలు బయటకు రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొలి దశ షెడ్యూల్ కూడా విడుదలైంది

KCR National Politic: గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ ని తీవ్రంగా నిరాశకు గురి చేశాయి. ఆ ఎఫెక్ట్ ద్వారా కేసీఆర్ రెండు నెలలు బయటకు రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొలి దశ షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఇతర పార్టీల నేతలను తన పార్టీలోకి ఆహ్వానిస్తూ బీఆర్ఎస్ ని బలహీన పరుస్తున్నాడు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలు కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో కేసీఆర్ రాజకీయంగా మరింత నిరాశకు గురవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న కేసీఆర్ ఆలోచనకు ఫుల్ స్టాప్ పడ్డట్లేదనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఫిరాయింపుల కారణంగా పార్టీ అయోమయంలో పడిపోవడంతో, జాతీయ స్థాయికి వెళ్లాలన్న కేసీఆర్ ప్రణాళికలు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. మహారాష్ట్రలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందో లేదో తెలియడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్‌ఎస్‌గా జాతీయ స్థాయికి మార్చిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. మహారాష్ట్రపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మహారాష్ట్ర మాజీ శాసనసభ్యులతో సహా చాలా మంది నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. అయితే గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవ్వడంతో కేసీఆర్ ప్లాన్‌లన్నింటికీ బ్రేకులు పడినట్లయింది. మొత్తంగా తెలంగాణలో పార్టీ నష్టాన్ని అరికట్టలేకపోయింది. గత వారం రోజులుగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందు ఇద్దరు బీఆర్‌ఎస్ ఎంపీలు బీజేపీలో చేరారు.

అధికారంలో ఉంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. అధికారంలో లేనందున లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కూడా సీట్లు గెలవడం అంత సులువు కాదని బీఆర్‌ఎస్ భావిస్తుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను బీఆర్‌ఎస్ కేవలం 9 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్, బీజేపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) వరుసగా మూడు, నాలుగు, ఒక సీటు గెలుచుకున్నాయి. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోరు జరిగే అవకాశం ఉంది. దీంతో కేసీఆర్ జాతీయస్థాయి అంశం మర్చిపోవాల్సిందేనని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతుకుంటున్నారు.

Also Read: IPL 2024 Opening Ceremony: స్టార్స్ తో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ… వేడుకల్లో పెర్ఫార్మ్ చేసేది ఎవరంటే ?