KCR Public Meeting: 2 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్నీ బీఆర్ఎస్ స్వయంగా ప్రకటించింది.

KCR Public Meeting: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్నీ బీఆర్ఎస్ స్వయంగా ప్రకటించింది. గత డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. అయితే అనూహ్యంగా కేసీఆర్ బాత్రూంలో కాలు జారీ కిందపడిపోవడంతో తుంటి ఎముక విరిగినట్లు డాక్టర్లు నిర్దారించారు. కొన్ని వారాలపాటు కేసీఆర్ యశోద ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నారు. తాజాగా కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. కట్ చేస్తే కేసీఆర్ ప్రజల్లోకి రావాలని నిశ్చయించుకున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ వరుసగా భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆయనే సొంతంగా స్టార్ కాంపైనర్ పాత్ర పోషించారు. ఇప్పుడు మూడు నెలల తర్వాత 2 లక్షల మందితో ఆయన భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. నల్లగొండ జిల్లాలో కెసిఆర్ భారీ బహిరంగ సభ ఉండనున్నట్లు కారు పార్టీ ప్రకటించింది. ఫిబ్రవరి చివరి వారంలో సభ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సభకు భారీ జనసమీకరణకు పార్టీ కట్టుబడి ఉంది. కనీసం 2 లక్షల మందిని హాజరయ్యేవిధంగా కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారట. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గ సన్నాహాలను ప్రారంభించింది.

బహిరంగ సభ ద్వారా కేసీఆర్ కాంగ్రెస్ ఆరోపణలపై క్లారిటీ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టంపై కాంగ్రెస్ పార్టీ రోజుకో ఆరోపణ చేస్తూనే ఉంది. అందుకు తగ్గ ఆధారాలను బయటపెడుతోంది. ముఖ్యంగా కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు, మేడిగడ్డ, ఇలా పలు అంశాలను లేవనెత్తుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారంటూ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ భారీ సభపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

Also Read: MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. నేడు విచారణ