Phone Tapping Case : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలంటూ సిట్ (SIT) జారీ చేసిన నోటీసుల మేరకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని నందినగర్‌కు బయల్దేరారు. కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారన్న వార్తతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులను తెరపైకి తెచ్చిందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
భారీ జనసందోహం – నినాదాలతో హోరెత్తిన వీధులు
కేసీఆర్ తన నివాసం నుండి బయల్దేరిన సమయం నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ నినాదాలతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి. కేసీఆర్ కాన్వాయ్‌పై పూలు జల్లుతూ అభిమానులు తమ మద్దతును ప్రకటించారు. వందలాది మంది నాయకులు, కార్యకర్తలు దారి పొడవునా నిలబడి ఆయనకు సంఘీభావం తెలపడం విశేషం. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
నందినగర్‌లోని సిట్ కార్యాలయం వద్ద విచారణ నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నందినగర్ బస్ స్టాప్, బసవతారకం రోటరీ, అగ్రసేన్ జంక్షన్, టీఎస్ స్టడీ సర్కిల్ మరియు ఎన్టీఆర్ భవన్ పరిసరాల్లో వాహనాల మళ్లింపు చేపట్టారు. విచారణ ఎంతసేపు కొనసాగుతుందనే దానిపై స్పష్టత లేనందున, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఎలాంటి వివరణ ఇస్తారనే అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వేధింపుల్లో భాగంగా జరుగుతున్న సిట్ విచారణకు హాజరు కావడానికి ఎర్రవెల్లి నివాసం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
సిట్ విచారణకు హాజరు కావడానికి హైదరాబాద్ వస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి.. జై… pic.twitter.com/OoEslPOeZ2
— BRS Party (@BRSparty) February 1, 2026
