KCR-KTR : తండ్రి జాతీయవాదం,త‌న‌యుడి ప్రాంతీయ‌వాదం,`క‌ల్వ‌కుంట్ల` మాయ‌

తెలంగాణ సీఎం కేసీఆర్ మాట‌కారిత‌నంకు మించిన విధంగా మంత్రి కేటీఆర్,

  • Written By:
  • Updated On - February 8, 2023 / 02:11 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ చాణక్యాన్ని ఆ కుటుంబం వార‌స‌త్వంగా పొందిన‌ట్టు క‌నిపిస్తోంది. మాట‌కారిత‌నంలో ఆయ‌న‌కు మించిన విధంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే క‌విత(KCR-KTR) నోటి వెంట త‌ర‌చూ వినిపిస్తుంటుంది. భార‌త రాష్ట్ర స‌మితి(BRS) పెట్టిన త‌రువాత ప్రాంతీయ‌వాదాన్ని కేసీఆర్ వ‌దిలేశారు. జాతీయ‌వాదాన్ని బ‌లంగా వినిపిస్తున్నారు. ఆయ‌న బాట‌న క‌విత కూడా జాతీయ‌వాదాన్ని వినిపిస్తూ ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ, మంత్రి కేటీఆర్ మాత్రం తెలంగాణ వాదాన్ని బ‌లంగా వినిపిస్తున్నారు. అంటే, తండ్రీకూతుళ్లు జాతీయ‌వాదం, కుమారుడు ప్రాంతీయ వాద‌మ‌న్న‌మాట‌.

తండ్రీకూతుళ్లు జాతీయ‌వాదం, కుమారుడు ప్రాంతీయ వాద‌మ‌న్న‌మాట‌..(KCR-KTR)

చెప్పేవాడికి వినేవాడు లోకువ‌న్న‌ట్టు, తెలంగాణ ప్ర‌జ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు క‌ల్వ‌కుంట్ల కుటుంబం(KCR-KTR) ఏది చెప్పినా విన్నారు. సెంటిమెంట్ ను రాజేసి ఒక‌ప్పుడు ర‌బ్బ‌రు చెప్పుల‌తో తిరిగిన‌ ఆ కుటుంబం ఇప్పుడు రాజ‌రికం అనుభ‌విస్తుంద‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆయ‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఎనిమిదేళ్ల‌లో ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యం గురించి చెబుతున్నారు. అంటే, సెంటిమెంట్ ను రంగ‌రిస్తూ ఆస్తుల‌ను కూడ‌బెట్టుకున్నారని స‌గ‌టు తెలంగాణ పౌరుడు ఎవ‌రిని అడిగినా చెబుతారు.

క‌ల్వ‌కుంట్ల కుటుంబ మాట‌కారిత‌నం

ఇప్పుడు జాతీయ వాదాన్ని అందుకున్న కేసీఆర్ ను పెద్ద మ‌న‌సుతో తెలంగాణ ప్ర‌జ‌లు అంగీకరిస్తున్నారు. అంతేకాదు, కుమారుడు కేటీఆర్ తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న‌ప్ప‌టికీ న‌మ్ముతున్నారు. వాళ్ల‌కు వినిపించే వాదం చుట్టూ ఆర్థిక సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకునే ఎత్తుగ‌డ అనే విష‌యాన్ని గ్ర‌హించాల‌ని విప‌క్ష పార్టీలు ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ క‌ల్వ‌కుంట్ల కుటుంబ మాట‌కారిత‌నం తెలంగాణ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తోంది.

Also Read : Jagan-KCR : మోసం గురూ..! అన్న‌ద‌మ్ముల రాజ‌కీయ చ‌తుర‌త‌!!

ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్ట‌డ‌మే కాదు, ఒక్కో ఎన్నిక‌కు ఒక్కో విధంగా క‌ల్వ‌కుంట్ల కుటుంబం రియాక్టు కావ‌డాన్ని అవ‌లోక‌నం చేసుకుంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది. ప్రాంతీయ‌వాదాన్ని రెచ్చ‌గొట్ట‌డం ద్వారా 2001 నుంచి పైసా పెట్టుబ‌డి లేకుండా కోట్ల రూపాయ‌ల‌కు అధిప‌తుల‌య్యార‌ని విప‌క్షాలు చెప్పే మాట‌. తెలంగాణ సాధించిన త‌రువాత కాప‌లా కుక్క‌లా ఉంటాన‌ని కేసీఆర్ చెప్పారు. ద‌ళితుల‌ను ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని ఆనాడు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాత్ర‌మే పార్టీ పెట్టాన‌ని చెప్పారు. రాష్ట్రాన్ని ప్ర‌క‌టించిన త‌రువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాన‌ని అప్ప‌ట్లో చెప్పిన సంగ‌తి ఇప్పుడు కీల‌కంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేశ‌వ‌రావుకు బాగా తెలుసు.

క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి అడ్డూఅదుపులేకుండా పోయింద‌ని విప‌క్షాలు..

ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత టీఆర్ఎస్ ఉద్య‌మ పార్టీ కాదు, ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ(KCR-KTR) అంటూ ప్ర‌క‌టించారు. ఇత‌ర పార్టీల్లోని లీడ‌ర్ల‌ను లాగేసుకున్నారు. ఒక వేళ టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటే వాళ్ల మీద ఏసీబీ, సీఐడీ, పోలీసుల‌ను ప్ర‌యోగించారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీన‌ప‌డింది. ఉద్య‌మం నుంచి త‌ప్పుకున్న కేసీఆర్  ఫ‌క్తు  రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌రువాత విప‌క్షాల‌ను నామ‌రూపాల్లేకుండా చేశారు. బొటాబొటి మోజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2018 వ‌ర‌కు చేసిన పాల‌న అంతా విప‌క్షాల‌ను నిర్వీర్యం చేయ‌డ‌మే. అయిన‌ప్ప‌టికీ 2018 ఎన్నిక‌ల్లో కేసీఆర్ మాట‌కారిత‌నం, సెంటిమెంట్ మ‌రోసారి ప‌నిచేసింది. అధికారంలోకి రెండోసారి వ‌చ్చిన త‌రువాత ఇక క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి అడ్డూఅదుపులేకుండా పోయింద‌ని విప‌క్షాలు త‌ర‌చూ చేసే విమ‌ర్శ‌.

Also Read: KCR Before : ఫిబ్ర‌వ‌రిలో అసెంబ్లీ ర‌ద్దు లేన‌ట్టే!ముంద‌స్తుకు `గుత్తా` ప‌రోక్ష సంకేతం!

రియ‌ల్ ఎస్టేట్‌, విద్య‌, వైద్య‌, మీడియా, రాజ‌కీయ త‌దిత‌ర రంగాల‌న్నీ క‌ల్వ‌కుంట్ల కుటుంబం కిందకు వెళ్లిపోయాయ‌ని సర్వ‌త్రా వినిపించే మాట‌. ఆ కుటుంబం ఆడింది ఆట పాడింది పాట‌గా తెలంగాణ పాల‌న మారింది. ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేల‌ను లాగేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం అసెంబ్లీలో లేకుండా చేశారు. ఇక ఇప్పుడు తెలంగాణ ప‌రిధిని దాటి దేశానికి ఎగ‌బాకాల‌ని కేసీఆర్ బీఆర్ఎస్(BRS) పార్టీని స్థాపించారు. ఇదే స‌మ‌యంలో ప్రాంతీయ వాదాన్ని కేటీఆర్ వినిపిస్తూ అసెంబ్లీ వేదిక‌గా యాక్టింగ్ సీఎంగా(KCR-KTR) ఇటీవ‌ల క‌నిపిస్తున్నారు. అంతేకాదు, తెలంగాణ సెంటిమెంట్ ను ఈసారి కుమారుడు కేటీఆర్ పండించేలా వ్యూహాన్ని రచించిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా జ‌ర్న‌లిస్ట్ ల హౌసింగ్ సొసైటీ విష‌యంలో మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో రియాక్ట్ అయిన తీరును తీసుకోచ్చు. ఎక్కువ‌గా తెలంగాణ జ‌ర్న‌లిస్ట్ లు లేని సొసైటీగా భావిస్తూ మిగిలిన జ‌ర్న‌లిస్ట్ ల‌తో ముడిపెడుతూ ప‌రోక్షంగా ప్రాంతీయ‌వాదాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు.

క‌ల్వ‌కుంట్ల కుటుంబం రెండు నాల్క‌ల ధోర‌ణిని..(BRS)

మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ మాదిరిగా తెలంగాణ రాష్ట్ర స‌మితిని తెలుగు రాష్ట్ర స‌మితిగా వ్యాఖ్యానించిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు అండగా నిల‌బడ్డారు. ఏపీలోని భీమ‌వరంలో పోటీ చేస్తాన‌ని ప‌రోక్షంగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ తెలంగాణ ఓటర్లు న‌మ్మారు. జాతీయవాదం, ప్రాంతీయ వాదాన్ని ఒకే నాలుక‌తో వినిపిస్తున్న‌ప్ప‌టికీ తెలంగాణ ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నారు. కాంట్రాక్టులు, వ్యాపారాలు, వివిధ రంగాల్లో ఆంధ్రా వాళ్ల‌తో క‌లిసి పెట్టుబ‌డులు పెట్టుకుంటారు. కానీ, ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి ఆంధ్రోళ్లు అంటూ సెంటిమెంట్ ను రేపుతున్న‌ప్ప‌టికీ తెలంగాణ ఓట‌ర్లు కేసీఆర్, కేటీఆర్ మాట‌ల‌కు ప‌డిపోతున్నారు. ఈ బ‌ల‌హీన‌త‌ను ఆస‌ర‌గా చేసుకుని వేల కోట్ల రూపాయ‌లు దోచుకున్నార‌ని విప‌క్ష లీడ‌ర్లు ఆరోపిస్తున్నారు. కుమారుడు ప్రాంతీయ‌వాదాన్ని, తండ్రి జాతీయ‌వాదాన్ని వినిపించ‌డాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈసారైన ఓట‌ర్లు క‌ల్వ‌కుంట్ల కుటుంబం రెండు నాల్క‌ల ధోర‌ణిని గ‌మ‌నించాల‌ని విప‌క్షాలు ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం మొద‌లు పెట్టారు. ఈసారైనా స‌గ‌టు తెలంగాణ పౌరుడు విప‌క్షాల ప్ర‌చారాన్ని న‌మ్ముతారా? క‌ల్వకుంట్ల కుటుంబం వైపు నిల‌బ‌డ‌తారా? అనేది చూడాలి.