Site icon HashtagU Telugu

KCR Vs Chandrababu : రేవంత్ కాదు, విలన్ చంద్రబాబు!!

Kcr Chandrababu Cm Revanth Reddy Telangana Politics Ap Cm Andhra Pradesh

By ఎస్.కే.జకీర్

KCR Vs Chandrababu :  ‘‘మరో రూపంలో తెలంగాణలో అడుగు పెట్టడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు.తెలంగాణ మళ్ళీ వలసవాద కుట్రలకు బాలి కావద్దు.గతం గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం.తిరిగి వలసవాదుల బారిన పడితే తెలంగాణ కోలుకోకుండా ఆగమవుతుంది” అని కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు 2028 అసెంబ్లీ ఎన్నికల ‘ముఖచిత్రాన్ని’ సూచనప్రాయంగా ప్రతిబింబిస్తోంది. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ రూపంలో కాకుండా ‘ఎన్డీఏ కూటమి’ రూపంలో రావచ్చునని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కొద్ధిరోజుల కిందట విజయవాడ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంతనాలు జరిపారు.2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి సన్నాహాలు ప్రారంభించవలసిందిగా షా సూచించారు.టీడీపీ,బీజేపీ,జనసేన పార్టీల కూటమి తెలంగాణలో అధికార పగ్గాలు చేబట్టడానికి వ్యూహరచన సమాచారం కేసీఆర్ కు అంది ఉండవచ్చు.ఆయనకు ఆంధ్రప్రదేశ్ లోనూ,టీడీపీ నాయకులలోనూ ‘నెట్ వర్క్’ ఉంది.కేసీఆర్(KCR Vs Chandrababu)  పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీయే అనే సంగతి తెలిసిందే. ‘రేవంత్ రెడ్డిని తాను లెక్క చేయదలచుకోలేదని,చంద్రబాబు కూటమితోనే తాను పోరాడబోతున్నట్టు’ కేసీఆర్ చెప్పకనే చెబుతున్నట్లున్నది.’కుక్కను చంపడానికి ముందు దాన్ని పిచ్చి కుక్కగా ముద్ర వేయాలి’ అనే సామెత ప్రకారం చంద్రబాబు అండ్ కో తెలంగాణలో అడుగిడితే ఈ రాష్ట్రం ‘వలసవాదుల’ చేతుల్లోకి వెళ్లి సర్వనానాశనమవుతుందని కేసీఆర్ ఒక థియరీని తయారు చేస్తున్నారు.

Also Read :Solar Soundbox : సోలార్‌ సౌండ్‌ బాక్స్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?

అందరూ ఊహించినట్టుగానే  ‘తెలంగాణ సెంటిమెంటు’ అస్త్రాన్ని బూజు దులిపి మళ్ళీ బయటకు తీశారు.అది కాలం చెల్లిన ఔషధమని పలువురి భావన.స్వరాష్ట్రమే సాకారమయ్యాక ఇన్ని సంవత్సరాల తర్వాత అలనాటి ‘ప్రత్యేక భావోద్వేగాలు’ రగిలించినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చునన్నది కొంతమంది వాదన. ‘పార్టీ అంటే మేమే,మేమే పార్టీ’ అనే వైఖరితో కేసీఆర్,కేటీఆర్ ప్రవర్తించిన కారణంగా పార్టీ కింది స్థాయి శ్రేణులన్నీ భగభగ మండిపోయాయి.’కుటుంబ పాలన’ కు వ్యతిరేకంగానే 2023 డిసెంబర్ లో ప్రజలు తీర్పు ఇచ్చారు.అయినా బిఆర్ఎస్ నాయకత్వంలో ‘అహంకార’ ప్రదర్శన తగ్గుముఖం పట్టడం లేదు.2018 అసెంబ్లీ ఎన్నికల వేళ చంద్రబాబును ‘బూచి’ గా చూపి కాంగ్రెస్ కూటమిని చావుదెబ్బ కొట్టిన అనుభవం కేసీఆర్ కు ఉన్నది.మరలా అదే ‘పాచిక’ను ప్రయోగించడానికి కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు.

కాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ప్రసంగం చప్పగా సాగింది.దాదాపు పది నెలల తర్వాత ప్రత్యక్షమైన కేసీఆర్ నోటి నుంచి తూటాలు వెలువడతాయని,ఆయన మాటలతో ‘కిక్కు” వస్తుందనుకున్న పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందని కూడా అనుకున్నారు.అందుకు భిన్నంగా రాకడ,పోకడ జరిగిపోయాయి.
”ఆయనలో మునుపటి ఫైర్ కనిపించలేదు.సాదా సీదాగా మాట్లాడారు.మేమిట్లా ఊహించలేదు”అని కొందరు నాయకులు ఈ సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు.

Also Read :Women of the Year : పూర్ణిమా దేవి.. టైమ్‌ మేగజైన్‌ ‘విమెన్ ఆఫ్‌ ది ఇయర్‌’.. ఎవరామె ?

”సూర్యుని విలువ కనిపించకుండా పోయినప్పుడే తెలుస్తుంది.రోజంతా వాన కురుస్తూ ఉంటే సూర్యుడ్ని చూడాలన్న తహ తహ ఎక్కువవువుతుంది.కానీ వేసవి కాలం ఎక్కువగా కొనసాగితే సూర్యుడ్ని మనం తిట్టుకుంటాం.అందుకే కనిపించీ,కనిపించకుండా ఉండడం నేర్చుకోవాలి.అందరూ మనల్ని వెనక్కి పిలిచేలా చేసుకోండి”అని 1601-1658 కాలానికి చెందిన తత్వవేత్త బాలాస్తర్ గ్రేషియన్ అన్నాడు.కేసీఆర్ కూడా బహుశా ఇలాగే అనుకొని కొన్ని నెలలపాటు ప్రజలకు కనిపించకుండా,తర్వాత కనిపిస్తే తన కోసం అందరూ ఎదురుచూస్తారని అనుకొని  ఉండవచ్చు.అయితే ఇది రాకెట్ యుగం.ఎవరి కోసం ఎవరూ నిరీక్షించే పరిస్థితులు లేవు.ఎవరు ప్రజలకు నిరంతరం కనిపిస్తూ,వినిపిస్తూ ఉంటే వారే జనాన్ని త్వరగా ఆకర్షిస్తారు.మునుపటి కాలం కాదిది.ఎవరో వస్తారు,ఏదో చేస్తారు అనే వాతావరణమేదీ లేదు.కేసీఆర్ కు ఈ విషయాలు తెలియవా?మన లాంటి సామాన్యులు చెప్పాలా?

”తెలంగాణ సమాజం సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బిఆర్ఎస్.తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వహించిన తెలంగాణ ప్రజల పార్టీ ఇది.తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలి. అటు పార్టీ విజయాన్ని ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం పార్టీ కార్యకర్తలు సమాంతరంగా పని చేయాలి”.అని కేసీఆర్ తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పారు.అంటే బిఆర్ఎస్ ‘శాశ్వతంగా అధికారంలో’ ఉండాలన్న అభిలాష ఆయన మనసులో ఉంది.మనవడు హిమాంశును కూడా సీఎం చేయాలన్న ఆలోచన ఉండవచ్చు.

ఇందులో 1.తెలంగాణ రాజకీయ అస్తిత్వం.2.తెలంగాణ వలసవాదుల బారిన పడకూడదు.3.తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం కావాలి.ఈ మూడు అంశాలనూ మాట్లాడడానికి కేసీఆర్ కు అర్హత లేదు.తెలంగాణ రాజకీయ అస్థిత్వంతో కేసీఆర్ చెలగాటమాడారు.2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత తలసాని శ్రీనివాసయాదవ్,సబిత వంటి వారిని చేర్చుకొని మంత్రి పదవులు ఇవ్వడం ఏ ‘అస్తిత్వం’ ప్రమాణాల కిందకు వస్తుంది.వలసవాదులు ఎవరు?రేవంత్ రెడ్డి వలసవాది కాదు.భట్టి విక్రమార్క,ఉత్తమ్,శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి,జూపల్లి  వంటి వారెవరూ వలసవాదులు కాదు.బిఆర్ఎస్ పార్టీకి చెందని వారంతా  ‘వలసవాదులు’, ‘తెలంగాణ ద్రోహులు’ అని నిర్వచించాలనుకుంటే అది వేరే చర్చ.ఇక తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అంటే ? బిఆర్ఎస్ విజయమేనా? ప్రజలు బిఆర్ఎస్ ను శాశ్వతంగా గెలిపించుకుంటూపోతే ‘ప్రజలు శాశ్వత విజయం’ పొందినట్లేనా ?దీని తాత్పర్యం ‘నేను,నా కొడుకు,కూతురు,మనవడు హిమాంశు…. వరుసగా సీఎం పదవులు అలంకరించాలి’ అని కేసీఆర్ భావిస్తున్నట్టుగా పరిశీలకులు అనుకుంటున్నారు.’ప్రజలంటే బిఆర్ఎస్,బిఆర్ఎస్ అంటే ప్రజలు.కేసీఆర్ అంటే  తెలంగాణ’ అనే భావనే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.

టిఆర్ఎస్ ఆవిర్భవించి 25వ  సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏడాది కాలం పాటు నిర్వహించాలని అంటున్నారు.బాగానే ఉంది.కానీ బిఆర్ఎస్ సంగతేమిటి ?తాను నెల విడిచి సాము చేయడంలో భాగంగా ‘జాతీయ రాజకీయాలలోకి  వెళ్ళే ఉద్దేశంతో చారిత్రిక తప్పిదం చేసినట్టు కేసీఆర్ నిజాయితీగా ఎందుకు ఒప్పుకోవడం లేదు?ఇందుకు సహజంగానే  ‘ఇగో’ అడ్డు తగులుతోంది కావచ్చు.ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునే మానసిక స్థితిలో కేసీఆర్ లేరని అర్ధమవుతోంది.అయినా సరే,తమ పార్టీ తెలంగాణలో ‘శాశ్వతంగా అధికారంలో ఉండాలి’ అని ఆయన బలంగా కోరుకుంటున్నారు.పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనే కేసీఆర్ తన తప్పిదాలను ఒప్పుకోకపోతే,ఇంకా ఏ వేదికలపై ఒప్పుకుంటారు?పార్టీ కార్యకర్తలు,నాయకులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారంటూ  టివి న్యూస్ చానళ్లు అదే పనిగా కథనాలు ప్రసారం చేశాయి.

అయితే ‘దిశా నిర్దేశం’పై కాంక్రీట్ నిర్ణయాలేవీ బయటకు రాలేదు.సమావేశం వీడియోలు చూసిన వారికి ఒక విషయం అర్ధమైంది.పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు.మిగతా అందరూ బుద్ధిగా నోట్స్ రాసుకుంటూ కనిపించారు.అలా రాసుకోకపోయినా కేసీఆర్ నుంచి ఎలాంటి చీవాట్లు ఉంటాయోనన్న భయంతో,గతంలో ఉన్న అనుభవాలతో వాళ్ళు అయన ‘ఆదేశాల పాలన’ చేశారు.పార్టీని సంస్థాగతంగా నిర్మించుకొని బలోపేతం చేయాలన్న అంశం ఒక్కటే ఈ సమావేశంలో కొత్త నిర్ణయం.పార్టీ కమిటీల ఎంపిక బాధ్యతను హరీశ్ రావుకు అప్పగించారు.’ఒక కిలో బరువు మోయమని కేసీఆర్ చెబితే వంద కిలోల బరువు మోసే రకం’ అని పార్టీ కార్యకర్తలలో ఎప్పటి నుంచో ఉన్న ఒక టాక్.

కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత మీడియా ముందుకు రాలేదు.పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడతారేమోనన్న అంచనాలు వేశారు.కానీ ఆయన తరపున కొడుకు కేటీఆర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.” నీకు నాకంటే ఎక్కువ తెలుసా ? నీది ఏమి పేపర్? ఏమి ఛానల్?ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా?మీరు ఏమి జర్నలిస్టులు ? మీకు ఎవరు చదువు చెప్పారు” అనే అవమానాలు ఎదురైనా సరే,కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే దాని మజా వేరు అని విలేకరులు భావించిన మాట నిజం.సాధారణంగా పామును చూడాలంటే మనందరికీ భయం.కానీ దాన్ని చూడాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది.అలాంటిదే కేసీఆర్ మీడియా సమావేశం కూడా.ఆయన తిట్టినా పడే జర్నలిస్టులు ఉన్నారు.ఆయన ప్రేమకు నోచుకునే జర్నలిస్టులు ఉన్నారు.ఆయన తమ పేరు పెట్టి పిలిస్తే అదే మాహా భాగ్యం అనుకునే జర్నలిస్టులూ ఉన్నారు.కేసీఆర్ తో ఫోటో దిగి వ్వాట్సాప్ డీ.పీ.లో పెట్టుకుంటే జీవితమా ధన్యమైందని అనుకునే పార్టీ కార్యకర్తలు,నాయకులు,వంది మాగధులకు కొరత లేదు.
జర్నలిస్టులు అయినా,ప్రజలయినా తమకు ‘ఆత్మగౌరవం’ ఉంటుందనో,ఉండాలనో అనుకునే కాలం కాస్తా 2014 తర్వాత కనుమరుగయ్యింది.’ఆత్మగౌరవం’ అనే మాటను పదేండ్ల పాటు ఒక పద్దతి ప్రకారం నిర్మూలించేశారు.

‘ప్రసంగ కళ’లో ఆరితేరిన వ్యక్తి కేసీఆర్.తన ‘కంఠం’తోనే ఆయన పదమూడేండ్ల పాటు ఉద్యమాన్ని,పదేండ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపారు.అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికలలో,ఆ తర్వాత మరికొన్ని సందర్భాలలో సభల్లో మాట్లాడారు.అనంతరం ఆయన తన ఫార్మ్ హౌజ్ కు పరిమితమయ్యారు.ఫిబ్రవరి 19 న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.దారిలో సికింద్రాబాద్ పాస్ పోర్టు ఆఫీసుకు వెళ్లి పాస్ పోర్టు రెన్యూవల్ చేసుకున్నారు.తన మనవడు హిమాన్షు కోసం కేసీఆర్ త్వరలో అమెరికాకు పయనం కానున్నట్టు ఒక ప్రచారం ఊపందుకున్నది.

”మళ్ళీ అధికారం మాదే” అనే నినాదం ఆకర్షణ కోల్పోయినా దాన్నే పట్టుకొని కేసీఆర్ వేళ్ళాడుతున్నారు.రేవంత్ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగదన్నది కేసీఆర్ ఊహ.బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెలేల నియోజకవర్గాల్లో ‘ఉపఎన్నికలు’ రానున్నట్టు కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు.ఆ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ ‘స్వీప్’ చేస్తే రేవంత్ ప్రభుత్వంలో ‘సంక్షోభం’సృష్టించవచ్చునన్నది ఆయన ప్రణాళిక.కేసీఆర్ ఫార్మ్ హౌజ్ నుంచి  ‘జన జీవన స్రవంతి’ లోకి రావడం పార్టీ శ్రేణులకు మంచి ‘కిక్కు’ నిచ్చే అంశం.కేసీఆర్ చాలా రోజుల తర్వాత వెలుపలికి వస్తున్నప్పుడు ఆయన ఎటువంటి సందేశం ఇవ్వనున్నారంటూ  ఆసక్తి కొనసాగింది.అదే సమయంలో,ఆయన తమ హయాంలో జరిగిన తప్పిదాలు,లోటు పాట్లు,ప్రజల నుంచి తాము ఎందుకు దూరమయ్యామో,ప్రజలు తమకు ఎందుకు దూరమయ్యారో కేసీఆర్ వివరణ ఇస్తారని కొందరు ఊహించినా అది జరగలేదు.”మమ్మల్ని అధికారానికి దూరం చేసి ఏమి కోల్పోయారో ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది” అంటూ ఫార్మ్ హౌజ్ లో తనను కలిసిన జిల్లాల పార్టీ నాయకులు,క్యాడర్ ఎదుట చేసిన చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ అధినేత  ఉపసంహరించుకున్నట్టు కనిపించలేదు.

ముందుగా అసలు బిఆర్ఎస్ జాతీయ పార్టీయా,ప్రాంతీయ పార్టీయా అన్నది కేసీఆర్ స్పష్టం చేయలేకవడం ఒక సమస్య.పదేండ్ల కాలంలో దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేయవలసి వచ్చిందో,రైతు భరోసా తదితర పథకాల రూపంలో వేల కోట్ల రూపాయలను పుట్నాల వలె ఎందుకు పంచవలసి వచ్చిందో,ధనిక రాష్ట్రం కొన్నెండ్ల వ్యవధిలోనే అప్పుల ఊబిలో కూరుకుపోయిందో ఆయన జవాబు చెప్పలేదు.’ధరణి’ పేరిట జరిగిన ‘భూ దోపిడీ’,లక్షలాది ఎకరాల గుటకాయ స్వాహా,కాళేశ్వరం అక్రమాలు,ఫార్ములా ఈ రేసు,విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గోల్ మాల్,అన్నింటికీ మించి ఫోన్ ట్యాపింగ్ వంటి నేరాలపై కేసీఆర్ ‘వాంగ్మూలం’ పార్టీ సమావేశంలో ఇవ్వలేదు.తాము మరలా అధికారంలోకి వస్తే ‘గడీ’ పాలన ఉండదనీ,ఫార్మ్ హౌస్ నుంచి పరిపాలించబోమని చెప్పడానికి కేసీఆర్ సాహసించలేదు. ప్రగతిభవన్ ఖాళీ చేసినప్పుడు,దానికి రక్షణగా ఉన్న తొలగించిన ఇనుప ముళ్ల కంచెలు మళ్ళీ ఏర్పాటు చేస్తామనీ చెప్పలేదు.చెయ్యబోమనీ చెప్పలేదు.కేసీఆర్ ని ప్రజలు ఎంత ‘పరాక్రమవంతుడు’ అని అనుకుంటారో అంతకంటే ఎక్కువగా ఆయనలో ‘ పిరికితనమూ’ ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం.

అధికారం కోల్పోయిన నాటి నుంచి బిఆర్ఎస్ పార్టీలో నిస్తేజం అలుముకున్న మాట నిజం.పైగా పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు.వాళ్ళతో మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా ‘ఫిరాయించే’ సంకేతాలు అందగానే హుటాహుటిన బిఆర్ఎస్ లోనే కొనసాగే విధంగా ఫార్మ్ హౌజ్ లో ఒక ‘కథ’ నడిచినట్టు ప్రచారంలో ఉంది.కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లిన 10 మందిని మరలా తమవైపునకు ఆకర్షించేందుకు మాజీ మంత్రి హరీశ్ రావుకు కేసీఆర్ ‘టాస్క్’ ఇచ్చినట్టు తాజాగా మరో ప్రచారం నడుస్తోంది.

బిఆర్ఎస్ లోకి మళ్ళీ వెళ్లినా వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇవ్వరని బిఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి గాను ప్రస్తుతానికి తమ ఎపిసోడ్ ను వాడుకొని తర్వాత ‘కరివేపాకు’ వలె తీసి పారవేయడంలో కేసీఆర్ దిట్ట అని వారు భావిస్తున్నట్టు తెలియవచ్చింది.పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడవలసి ఉన్నది.ఈ నేపథ్యంలో తాము రెంటికి చెడ్డ రేవడిలా మారకుండా ఉండడానికి గాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమే బెటర్ అని పార్టీ మారిన శాసనసభ్యుల అంతరంగమని తెలియవచ్చింది.

“పరిపాలనపై దృష్టి సారించడం ద్వారా మేము మా పార్టీ వ్యవహారాలను విస్మరించాం” అనే వాస్తవ లోకంలోకి రావడానికి బిఆర్ఎస్ నాయకులకు,మరీ ముఖ్యంగా తండ్రీ,కొడుకులకు ‘ఇగో’ అడ్డం వస్తుండవచ్చు.కానీ అది నిజం.అదే నిజం.పార్టీని నిర్లక్ష్యం చేయడమన్నది 2024 నుంచే మొదలు కాలేదు.2001 నుంచి కూడా కేసీఆర్ ‘ఒంటెత్తు పోకడ’లతోనే పార్టీని నడిపారు.ఉవ్వెత్తున ఎగసిన ‘ఉద్యమ తుపాను’లో కేసీఆర్ పొరబాట్లు,తప్పులు కొట్టుకుపోయాయి.ఉద్యమం ‘పై చేయి’ సాధించిన సందర్భాలలో సహజంగానే రాజకీయపార్టీ కార్యకలాపాల్లోని లోటుపాట్లు ఎవరికీ కనిపించవు.మన ఫోకస్ మొత్తం ఉద్యమ కార్యాచరణపైన ఉంటుంది కనుక కేసీఆర్ నాయకత్వ లోపాలేవీ కాన రాలేదు.

ఏ పార్టీలోనయినా అత్యంత ముఖ్యమైన సంస్థాగత నిర్మాణం టిఆర్ఎస్/బిఆర్ఎస్ లో మొదటినుంచీ లేదు.గ్రామస్థాయి నుంచి  తెలంగాణ భవన్ కు సమగ్ర సమాచార పంపిణీ వ్యవస్థ లేదు.నిస్పాక్షిక విశ్లేషణలు,నివేదికలు కేసీఆర్,కేటీఆర్ కు చేరే అవకాశాలు లేవు.ఒకవేళ చేరినా ఆయా సమాచారాన్ని వాళ్లిద్దరూ అలక్ష్యం చేసే రకం.తమకు తెలిసిన దానికన్నా ఇంకొకరికి ఎక్కువ విషయాలు,వాస్తవాలు తెలిసే చాన్సు లేదని కేసీఆర్ నమ్ముతుంటారు.కాగా బిఆర్ఎస్ పార్టీ అస్తిత్వ ముప్పును ఎదుర్కుంటున్నట్టు స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ పుంజుకోవడం బీఆర్ఎస్ ‘పుణ్యమే’నన్న విశ్లేషణ ఉన్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. BRS 39 స్థానాలకు పరిమితమైంది.2018 లో కేవలం ఒక సీటు మాత్రమే పొందిన BJP 14% ఓట్లతో 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం తేలికగా తీసుకోవలసిన అంశం కాదు.

ఇదిలా ఉండగా తెలంగాణలో బాగా నలుగుతున్న,రగులుతున్న అంశం బీసీ రిజర్వేషన్లు,సామాజిక న్యాయం.ఎమ్మెల్సీ కవిత గడచిన డిసెంబర్ నుంచే ‘బీసీ కార్డు’తో సమావేశాలు,ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.బీసీ అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ బీసీ నాయకులే చెబుతున్నారు.కవితకు క్రెడిట్ పోకుండా పార్టీలోని ఒకరిద్దరు ముఖ్యులే కేసీఆర్ బ్రెయిన్ వాష్ చేసి ఉంటారని మరో ప్రచారం సాగుతున్నది.