MLC Kavitha: దేశంలో ఎవ్వరూ చేయనన్ని పనులు కేసీఆర్ చేశారు: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యం, కర్తవ్యం అని  ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Kavitha

Kavitha

తెలంగాణ (Telangana) ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యం, కర్తవ్యం అని  ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేనన్ని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని, జరిగిన అభివృద్ధిని, అందిస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి చామకూర మల్లా రెడ్డితో కలిసి  కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో కంటే అధిక మెజారిటీతో వచ్చే ఎన్నికల్లో గెలుస్తారన్న విశ్వాసం ఉందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి మీద ఎవరైనా పోటీ చేయాలనుకుంటే మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే అవుతుందని తెలియజేశారు. కాబట్టి ఇతర పార్టీల నేతలు గెలిచే అవకాశం లేనందుకు ఆశలు వదిలేసుకుంటే మంచిదని సూచించారు.

ఒకప్పుడు ఇదేమి పార్టీ అని అవహేళన చేశారని, కానీ ఇప్పుడు అదే గులాబీ పార్టీ ఇంటికి మూడు పథకాలు అందించే స్థాయికి ఎదిగిందన్నారు (Kavitha). పది మందికి సాయం చేశామంటే ఆ రోజు రాజకీయ నాయకులకు ప్రశాంతంగా నిద్రపడుతుందన్నారు. “మీరు చేసిన త్యాగం ఇవాళ తెలంగాణలో ఇస్తున్నటువంటి ప్రతీ పథకం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చిందించినటువంటి స్వేధం… చెరువుల్లో కనిపిస్తున్న మంచినీటి చుక్కలు. బీఆర్ఎస్ కార్యకర్తల త్యాగం … ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తెలంగాణ మొత్తానికి నీటి కుండలాగా తరతరలాకు ఆదుకునే ప్రాజెక్టు. మనది ఉట్టి రాజకీయ పార్టీ కాదు. ఎంతో కష్టంతో, కోపంతో, ఆవేదనతో , ప్రేమతో పుట్టుకొచ్చిన పార్టీ. ప్రజలను బాగు చేయాలని భావించిన పార్టీ మనది ” అని కార్యకర్తలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లలో దేశంలో ఎవ్వరూ చేయనన్ని మంచి పనులు బీఆర్ఎస్ పార్టీ చేసి చూపెట్టిందని స్పష్టం చేశారు.  మరింత బాధ్యతగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.  మనకు ఇతర రాజకీయ ఆలోచనలు  లేవని, ప్రజలకు మంచి చేయాలన్నదే ప్రధాన ఆలోచన అని స్పష్టం చేశారు. తెలంగాణకు బాగుపడాలని కోరుకునేవాళ్లమని చెప్పారు.

రెండు దశాబ్దాల నుంచి ప్రజల్లో ఉన్న నాయకులు ఈ మండలంలో ఉన్నారని చెప్పారు. అనేక మంది కార్యకర్తలు, నాయకులు గులాబీ కండువాకు అంకితమయ్యారని కొనియాడారు. తమ పార్టీ విస్తరిస్తోందని, ప్రజలకు మంచి జరగాలన్నది మొదటి ఉద్దేశమని, మనకు పదవులు రావడం అన్నది రెండో ఉద్దేశమని అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) లక్ష్యాన్ని, తెలంగాణ ప్రజల ఆశయాలను, అమరవీరుల త్యాగాలను, జయశంకర్ సార్ స్పూర్తిని తీసుకకొని ముందుకెళ్తున్న పార్టీ బీఆర్ఎస్ అని, ఇటువంటి పార్టీలో ప్రతీ ఒక్కరికి అవకాశాలు వస్తాయని, మంచి పదవులు వస్తాయని స్పష్టం చేశారు. లక్షా 33 వేల మంది బీడీ కార్మికులకు నిజామాబాద్ జిల్లాలో పెన్షన్ అందుతోందని, కాబట్టి ప్రత్యేకించి బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆస్పత్రిని నిర్మిస్తే కామారెడ్డి ప్రాంతంలో ఉన్న కార్మికులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు నిజామాబాద్ లో పెద్ద సంఖ్యలో ఉంటారని, వారికి బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు.

Also Read: IPL Effect: రెచ్చిపోయిన ప్రేమికులు.. రికార్డుస్థాయిలో కండోమ్స్, బిర్యానీ ఆర్డర్లు!

  Last Updated: 30 May 2023, 04:41 PM IST