KCR Dharna : అవసరమైతే ఢిల్లీ వరకు యాత్ర చేస్తాం- సీఎం కేసీఆర్

ఇందిరా పార్క్ రైతు మహా ధర్నాలో పాల్గొన్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకు పడ్డారు.

  • Written By:
  • Updated On - November 18, 2021 / 12:34 PM IST

ఇందిరా పార్క్ రైతు మహా ధర్నాలో పాల్గొన్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకు పడ్డారు. హైదరాబాద్ లో మొదలైన ఉద్యమం ఇక్కడితో ఆగదని.. అవసమైతే ఢిల్లీ వరకు యాత్ర కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ అని.. పరాయి పాలన నుంచి కొట్లాడి స్వేచ్చా వాయువులను సాధించుకున్న గడ్డ.. తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలిసిన గడ్డ అని కేసీఆర్ అన్నారు. అద్భుతమైన పద్దతిలో ముందుకు పోతున్నటువంటి తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అశనిపాతంగా తయారయ్యాని ఆయన విమర్శించారు.

Also Read : అసలు వరిధాన్యం గొడవ ఏంటంటే….

దేశాన్ని పాలించే వారు వితండవాదం చేస్తున్నారన్నారు. 2006 లో ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ దాదాపు 51 గంటలు ధర్నాకు కూర్చున్నారని గుర్తు చేశారు. ఈనాడు ముఖ్యమంత్రులు, మంత్రులు ధర్నాకు కూర్చునే దిక్కుమాలిన పరిస్థితులు దేశంలో ఉన్నాయని దీని ద్వారా దేశానికి ఓసందేశం వెళ్తుందని అన్నారు కేసీఆర్. ఈ పోరాటం తుదిదశ దాకా కొనసాగించాల్సిందే అని… ఈ ఒక్క పోరాటమే కాదు చాలా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని.. భవిష్యత్తులో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తాఅని కేసీఆర్ అన్నారు.

గత ఢిల్లీ పర్యటనలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరితే 50 రోజుల నుంచి ఉలుకుపలుకు లేకుండా నిద్ర నటిస్తుందని విమర్శించారు. తెలంగాణ రైతుల బాధ దేశానికి తెలిసేందుకే ధర్నాలకు పిలుపు ఇచ్చామన్నారు. ఉత్తర భారతంలో రైతుల చేస్తున్న నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలిపేందుకు తెలంగాణ లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతాయని సీఎం వెల్లడించారు. రైతుల ప్రయోజనాలు కాపాడే దాకా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలను ఉప్పెనలా కొనసాగిస్తామన్నారు. కేంద్రం పెద్దలకు రైతు సమస్యలు తెలిసేలా తెలంగాణ ప్రభుత్వం ధర్నాను కొనసాగిస్తుందన్నారు.