తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలనంగా మారింది. తాజాగా ఈమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించినట్టు ప్రముఖ తెలుగు మీడియా సంస్థ “ఆంధ్రజ్యోతి” ఒక వార్తను ప్రచురించింది. ఆ వార్త ప్రకారం.. ఆమె మంత్రి పదవి (Minister Post) ఇస్తే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రతిపాదించారట. అయితే సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నం విఫలమైందని ఆ వార్తలో పేర్కొనబడింది. ఈ వార్తలను కవిత ఖండించినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీపై తన స్థిరంగా ఉన్నాననే సంకేతాలను ఆమె స్పష్టంగా ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.
Bhatti Vikramarka : భూభారతి అమలుకు సిద్ధం అవుతున్నాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కవిత ఇటీవల తన తండ్రికి రాసిన లేఖ లీక్ కావడం, అందులో ఆమె చేసిన విమర్శలు పార్టీ లోపల జరుగుతున్న సంఘర్షణను బయటపెట్టినట్లయింది. ‘తండ్రి చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయి’ అనే ఆమె వ్యాఖ్య, బీఆర్ఎస్ లో ఆమె పట్ల ఉన్న అసంతృప్తి చూపుతుంది. ఆమె లేఖ నేపథ్యంలో కేసీఆర్ తరఫున ఇద్దరు సీనియర్ నేతలు రాజీకి ప్రయత్నించినా, కవిత భవిష్యత్తు రాజకీయ భరోసా కోరడంతో ఆ ప్రయత్నం విఫలమైందని చెబుతున్నారు. ఈ పరిణామాల అనంతరం ఆమె స్వయంగా ‘సింగరేణి జాగృతి’ అనే ఒక కొత్త వేదికను ఏర్పాటు చేయడం, పార్టీపై ఆమె విభిన్నంగా ఆలోచిస్తున్నారనే సంకేతాలను ఇస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవిత, తండ్రి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు మంత్రి పదవి వస్తుందని భావించడంలో తప్పు లేదు. కానీ ఆమెకు ఆ అవకాశం కలగకపోవడం, తర్వాత ఎంపీగా ఓడిపోవడం, మళ్లీ ఎమ్ఎల్సీ స్థాయికి పరిమితమవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలు పాలవడం తదితర ఘటనలు ఆమె రాజకీయ ప్రాధాన్యత తగ్గడానికి కారణమయ్యాయి. ఇదే సమయంలో కేసీఆర్ కూడా తన రాజకీయ కోరికలు నెరవేర్చుకోలేకపోవడం వల్ల కూతురిపై అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఇతర రాజకీయ అవకాశాలను పరిశీలించడాన్ని పూర్తి స్థాయిలో ఖండించలేము. రాబోయే రోజుల్లో ఆమె బీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా? లేక కొత్త మార్గాన్ని ఎంచుకుంటారా? అన్నది రాజకీయంగా ఆసక్తికరమైన విషయంగా మారుతోంది.