Kavitha CM Race: ‘‘రాబోయే కాలంలో మీరు సీఎం అవుతారు’’ అంటూ ఎమ్మెల్సీ కవితకు ఇటీవలే ఎరుకుల నాంచారమ్మ సోది జోస్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కవిత నిజంగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం పోస్టుకు గురిపెట్టారా అనే టాక్ మొదలైంది. ఎరుకుల నాంచారమ్మ చెప్పిన సోది జోస్యం వినగానే కవిత మురిసిపోయారు. జై తెలంగాణ అంటూ నినదించారు. అదే రోజు మీడియాతో మాట్లాడుతూ కవిత సంచలన కామెంట్స్ చేశారు. ‘‘ నాపై కొందరు సొంత పార్టీ నేతలే పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారెవరో నాకు తెలుసు. సమయం వచ్చినపుడు అన్నీ బయటకు వస్తాయి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read :Indias Best Friends: ‘ఆపరేషన్ సిందూర్’ వేళ భారత్‌కు బెస్ట్ ఫ్రెండ్స్.. ‘‘ఆ నలుగురు’’ !
కీలకమైన పార్టీ పదవి కోసమేనా.. ?
ఇంతకీ కవిత(Kavitha CM Race)కు వ్యతిరేకంగా బీఆర్ఎస్‌లో ప్రచారం చేస్తున్న నేతలు ఎవరు ? వారిని అలా ఎంకరేజ్ చేస్తున్న ప్రధాన నేత ఎవరు ? అనేది తెలియాల్సి ఉందని బీఆర్ఎస్‌లోని కవిత వర్గీయులు అంటున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్‌లో జరుగుతున్న వర్గపోరు ఇప్పుడు బయటికి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ వర్గపోరు తీవ్రరూపు దాల్చే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి కంటిన్యూగా దాదాపు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలించింది. రెండుసార్లు కూడా కేసీఆరే సీఎం పదవిని చేపట్టారు. తన కుటుంబీకులకు ఇతర పదవులను ఆయన కట్టబెట్టారు. కుమారుడు కేటీఆర్‌కు అత్యంత కీలకమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారు. కవితకు మాత్రం అంతటి స్థాయి కలిగిన పదవేదీ ఇప్పటివరకు ఇవ్వలేదు. అందుకే ఆమె నైరాశ్యంతో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
కవితకూ అన్ని అర్హతలు
ఇప్పుడు కీలకమైన పార్టీ పదవిలో(బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా) కేటీఆర్ ఉన్నందున.. భవిష్యత్తులో బీఆర్ఎస్ మరోసారి గెలిచే పరిస్థితులు వస్తే కేటీఆర్‌కే సీఎం సీటు దక్కుతుందనే ఆందోళన కవితలో ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తనకూ ఆ స్థాయి కలిగిన పార్టీ పదవిని కవిత ఆశిస్తున్నారని అంటున్నారు. రాజకీయ అవకాశాల కోసం మహిళలూ పోరాడితే తప్పేముంది ? తెలంగాణ ఉద్యమంలో కవిత కూడా చాలా క్రియాశీలంగా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నెట్‌వర్క్‌ను బాగా పెంచారు. ప్రత్యేకించి మహిళల్లో బీఆర్ఎస్ పార్టీకి క్రేజ్ పెరిగేందుకు కవిత ప్రధాన కారకులు అయ్యారు. అందుకే బీఆర్ఎస్‌లో కీలక స్థానం కోసం పోటీపడే అర్హతలన్నీ కవితకు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఒకవేళ కవితకు వ్యతిరేకంగా బీఆర్ఎస్‌లో ఇలాగే ప్రతికూల ప్రచారం కొనసాగితే.. రాజకీయం అనూహ్య మలుపు తిరిగే అవకాశం ఉంది. కవిత సొంతంగా రాజకీయ బాటను వేసుకునే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.