Site icon HashtagU Telugu

TS : రోడ్డు కోసం ఇంటినే కూల్చేసిన ఎమ్మెల్యే..ఈరోజుల్లో ఇలాంటి వారు కూడా ఉంటారా..?

Bjp Kamareddy Emla

Bjp Kamareddy Emla

రాజకీయ నేతలు ఎలా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు..అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు..అవసరం అయిపోయాక జుట్టు పట్టుకుంటారు. ఇక ఎన్నికల్లో ఎన్ని మాటలు చెపుతారో చెప్పాల్సిన పనిలేదు..అవి చేస్తాం..ఇవి చేస్తాం అని ఎన్నో వాగ్దానాలు ఇస్తారు..ఒన్స్ గెలిచారో..మళ్లీ ప్రజల ముఖాలు కూడా చూడరు..మళ్లీ ఎన్నికలు వస్తే తప్ప..అలాంటి నేతలు ఉన్న ఈరోజుల్లో..ప్రజల అవసరం తీర్చే రోడ్డు కోసం ఏకంగా అడ్డుగా ఉన్న తన ఇంటినే కూల్చేసి వార్తల్లో నిలిచారు కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏకంగా మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేతను ఓడించి వార్తల్లో నిలిచారు కాటిపల్లి వెంకట రమణారెడ్డి. ఇక ఇప్పుడు మరోసారి ప్రజల కోసం తన ఇంటినే కూల్చి వార్తల్లో హైలైట్ అయ్యారు. కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 30 ఫీట్లు మాత్రమే ఉంది. రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయి గుంతలు, షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు తన ఇంటి నుంచే మొదలు పెట్టాలని అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేసి ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు.

నేడు ఉదయం ఆర్‌అండ్‌బి, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఆధ్వర్యంలో జేసీబీలతో దగ్గరుండి ఇంటిని కూల్చేయించారు. అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండటంతో అలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, వారం రోజుల్లో రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్డులు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు.

నెల రోజుల్లో ఇప్పుడున్న రోడ్డుకు అదనంగా మరొక 24 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే ఇంటినుంచి పాత బస్టాండ్ వరకు చేపట్టబోయే రోడ్డు వెడల్పులో ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. మరి షబ్బీర్ అలీ తన నివాసాన్ని కూల్చేస్తారా..లేదా అనేది చూడాలనే ఆసక్తి తో ప్రజలు ఉన్నారు. ఏది ఏమైనప్పటికి కాటిపల్లి వెంకట రమణారెడ్డి తీసుకున్న నిర్ణయం తో ప్రజలంతా ఈరోజు ఇలాంటి నేతలు కూడా ఉంటారా..? అని మాట్లాడుకుంటున్నారు.

Read Also : Delhi: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖలు, ఆప్ ఎమ్మెల్యేలకు 25 కోట్ల ఆఫర్‌ అంటూ