Kalvakuntla Kavitha : బీఆర్ఎస్‌లో అంతర్గతంగా ఏం జరుగుతోంది ? కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయపరంగా ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు ? బీఆర్ఎస్ పార్టీ తరఫున కాకుండా తెలంగాణ జాగృతి సంస్థ తరపున జనంలోకి వెళ్లేందుకు కవిత ఎందుకు సిద్ధమవుతున్నారు ? అనే దానిపై ఇప్పుడు తెలంగాణ అంతటా చర్చ జరుగుతోంది. ఏదిఏమైనప్పటికీ శుక్రవారం రోజు తన నివాసంలో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ జాగృతి ఇటీవలే జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. త్వరలోనే ఈ నివేదికను కులగణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావుకు స్వయంగా కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అందించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇదే తరహాలో నివేదికను కవతి సమర్పించారు.
Also Read :Iconic Bridge : తెలంగాణ-ఏపీ బార్డర్‌లో కృష్ణా నదిపై నాలుగు లేన్ల భారీ వంతెన
బీఆర్ఎస్ ప్రస్తావనను తీసుకురాకుండా ఇటీవలే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లాలలో రౌండ్ టేబుల్ మీటింగ్స్ జరిగాయి. కవిత నుంచి అందిన ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి క్యాడర్ ఆ విధంగా చేసిందని తెలుస్తోంది. ఇంతకీ ఎందుకలా ? బీఆర్ఎస్‌తో కవితకు గ్యాప్ ఎందుకు పెరిగింది ? బీఆర్ఎస్‌పై పట్టు కోసం కేటీఆర్, కవిత మధ్య యుద్ధం తీవ్రరూపు దాల్చిందా ? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
Also Read :Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ దూకుడు.. లీడ్‌లో ప్రియాంక.. అజిత్ పవార్ వెనుకంజ
వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలోనే తెలంగాణ జాగృతి సంస్థను కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహించి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఘనతను నలుమూలలా వ్యాప్తి చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏటా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేవారు. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మారిన తర్వాత.. తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా కవిత మార్చేశారు. భారత జాగృతి సంస్థ పేరుతో సామాజిక అంశాలపై ఆమె పోరాడారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా ఢిల్లీలో ధర్నాలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, తదుపరిగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకు వెళ్లడంతో భారత జాగృతి సంస్థ కార్యకలాపాలు ఆగిపోయాయి. అయితే ఇకపై మాత్రం తెలంగాణ జాగృతి పేరుతోనే కార్యక్రమాలు నిర్వహించాలని కవిత నిర్ణయించడం గమనార్హం. ‘తెలంగాణ’ అనే పదం ఉంటేనే రాష్ట్ర ప్రజలతో ఎమోషనల్‌గా అటాచ్ కావచ్చని కవిత భావిస్తున్నారట. భవిష్యత్తులో తెలంగాణ జాగృతి సంస్థ రాజకీయ పార్టీ రూపును సంతరించుకున్నా.. పేరు వల్ల ఈజీగా ప్రజల్లో మైలేజీ లభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద రానున్న రోజుల్లో తెలంగాణ జాగృతి ద్వారా రాజకీయాలు చేసేందుకు కవిత రెడీ అయ్యారు.