Site icon HashtagU Telugu

CM Revanth Reddy : కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీఎం వ్యాఖ్యలు

CM Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అజాగ్రత్తలతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించిందని ఆరోపించారు. కేవలం మూడు సంవత్సరాల్లోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని గుర్తుచేస్తూ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా పగుళ్లు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు.

సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కేబినెట్ సమావేశం అనంతరం ప్రెస్ మీట్‌లో సీఎం మాట్లాడుతూ, “రీ డిజైనింగ్” పేరుతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మార్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ అవినీతి చేశారని ఆరోపించారు. ఈ నిర్మాణాల్లో ప్లానింగ్, డిజైన్, నిర్వహణ స్థాయిల్లో లోపాలున్నాయని ఎన్‌డీఎస్‌ఏ ఇప్పటికే నివేదికలో స్పష్టం చేసిందని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ జరిపిస్తామని తమ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టం చేశామని గుర్తుచేశారు. ఆ హామీని అమలు చేస్తూ, జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలోని కమిషన్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలను కమిషన్ ప్రశ్నించిందని తెలిపారు.

మొత్తం 16 నెలలపాటు జరిగిన సమగ్ర విచారణ తర్వాత 665 పేజీల నివేదికను కమిషన్ సమర్పించిందని చెప్పారు. ఆ నివేదికను పరిశీలించేందుకు ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. “ఊరు, పేరు మార్చడమే కాదు… చివరికి అంచనాలు కూడా మార్చి అక్రమాలకు పాల్పడ్డారు,” అని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.

“మన కళ్ల ముందే, వారే నిర్మించిన కాళేశ్వరం వారికే కూలిపోయింది” అని ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్య చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ నివేదికను అసెంబ్లీలో చర్చించనున్నట్లు వెల్లడించారు. చర్చ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తామని హామీ ఇచ్చారు.

“అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ నివేదికను అన్ని ప్రజా ప్రతినిధులకు అందజేస్తాం. అందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పవచ్చు,” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Pithapuram Varma: టీడీపీకి షాక్ ఇవ్వ‌నున్న పిఠాపురం వ‌ర్మ‌.. రాజీనామ చేసే యోచ‌న‌లో కీల‌క నేత‌!