తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న మార్పులు, పార్టీల మార్పులు, నేతల వ్యాఖ్యలతో గత కొద్దీ రోజులుగా ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి పై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Kadiyam Srihari vs Palla Rajeshwar Reddy) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “నేను విశ్వసంగా ఉండే కుక్కనే… నీలాగా గుంట నక్క కాదు” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో రాజకీయ వేడిని పెంచాయి. కేసీఆర్ పట్ల నిబద్ధతగా ఉంటానని, అధికారానికి పార్టీ మారే వారిలా కాదని పల్లా వ్యాఖ్యానించారు.
YS Sharmila: ఈ జన్మకు మారరు.. పచ్చకామెర్ల రోగం ఇంకా తగ్గలేదా..? జగన్‌పై షర్మిల ఫైర్
కడియం బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచినవాడేనని, తర్వాత అధికారం కోసం పార్టీ మారడం ప్రజల విశ్వాసానికి ఘాతుకమని పల్లా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని కాపాడేందుకు కాపలా కుక్కలా పనిచేస్తానని, అవసరమైతే ప్రజల భూముల రక్షణ కోసం రేచు కుక్కలా పోరాటం చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శిస్తూ, ప్రభుత్వంపై తాము ప్రశ్నలు గుప్పిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అలాగే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధికి అడ్డుపడ్డారని, 100 పడకల ఆసుపత్రి ప్రారంభాన్ని కూడా ఆపేశారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పల్లా చేసిన వ్యాఖ్యలు చౌకబారు కామెంట్లేనని, అతను తన మాటలపై నియంత్రణ సాధించాలని హెచ్చరించారు. పల్లాను “బొచ్చు కుక్క”గా అభివర్ణిస్తూ, తన అహంకారాన్ని, బలుపును తగ్గించుకోవాలని సూచించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేసీఆర్ పేరును ఉపయోగించుకొని ఆస్తులు కూడబెట్టాడని, బీఆర్ఎస్ పార్టీని పాడుచేసిందీ అతడే అని కడియం మండిపడ్డారు. ఈ విధంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మరింత ఉధృతం చేసింది.