K Srinivas Reddy : సీనియర్ జర్నలిస్ట్ కే.శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ ఎం హనుమంత రావు ఆదివారం రిలీజ్ చేశారు. ఈ పదవిలో కే. శ్రీనివాస్ రెడ్డి రెండేళ్లపాటు కొనసాగనున్నారు. శ్రీనివాస్ రెడ్డి గతంలో విశాలాంధ్ర పత్రిక ఎడిటర్‌గా సుదీర్ఘ కాలం పని చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ గా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం ప్రజా పక్షం దినపత్రికకు ఎడిటర్‌గా (K Srinivas Reddy) వ్యవహరిస్తున్నారు. మీడియా అకాడమీ ఛైర్మన్‌కు క్యాబినెట్ ర్యాంక్ హోదా లభిస్తుంది. అంతకుముందు అల్లం నారాయణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా సేవలు అందించారు.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణలో నూతన సర్కారు ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించింది. ఇలా ఖాళీ అయిన నామినేటెడ్ పోస్టులను తమకు అనుకూలమైన కొత్త వారితో భర్తీ చేస్తోంది. ఈక్రమంలోనే తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలోనూ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా పనిచేశారు. చంద్రబాబు హయాంలో ఆయన ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా సేవలు అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. దశలవారీగా వివిధ కార్పొరేషన్లు, అకాడమీలకు ఛైర్మన్లను నియమిస్తోంది. ఇటీవలే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ జీ చిన్నారెడ్డిని నియమించింది. శనివారమే ఉత్తర్వులు జారీచేసింది.