Jupally : నా ఇంట్లో వైఎస్ఆర్ ఫోటో ఉంటే తప్పేంటి? : జూపల్లి

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. తనని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై స్పందించారు.

  • Written By:
  • Updated On - April 10, 2023 / 03:05 PM IST

Jupally : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. తనని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై స్పందించారు. మీడియా సమావేశంలో జూపల్లి (Jupally) మాట్లాడుతూ.. BRS నుంచి బయటకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పంజరం నుంచి బయటపడ్డానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ప్రభుత్వ పని తీరుని ప్రశ్నిస్తే తప్పా… పారదర్శక పాలనని కోరుకోవడం తప్పా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానాలో ఉన్నది ప్రజల సొమ్ము. ఆ సొమ్ముని ఖర్చు చేయడంలో కెసిఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. ప్రజల సొమ్ముని ఖర్చు చేసే ముందు ఆచి తూచి ఖర్చు చేయాలి.

నేను దానిని ప్రశ్నిస్తే సర్కార్ కు మింగుడు పడలేదు. కెసిఆర్ తన ముఖ్యమంత్రి పాలనను విస్మరించి నియంతృత్వ పోకడలకు పోతున్నారంటూ విమర్శించారు. ఇదే క్రమంలో సీఎం కెసిఆర్ కు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు జూపల్లి. నా ఇంట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్ ఫొటోతో పాటు కెసిఆర్ ఫోటో కూడా ఉన్నది. అయితే వైఎస్సార్ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు అని నన్ను పార్టీ ప్రశ్నిస్తుంది అని అసహనం వ్యక్తం చేశారు. ప్రజల కోరిక మేరకు 2011 లో నేను పార్టీలో చేరాను. ప్రజా సంక్షేమం కోసమే పని చేశాను. ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించినందుకు కెసిఆర్ కు భయం పట్టుకుంది. అందుకే నన్ను సస్పెండ్ చేశారు అంటూ సీఎం కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు.

కొద్దిరోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు పొంగులేటి, జూపల్లి (Jupally). ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. కెసిఆర్ పాలనను వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా వేదికగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. తాజాగా కొత్తగూడెంలో తమ మద్దతుదారులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేపట్టారు. దీంతో పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై ఈ రోజు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం సస్పెన్షన్ వేటు వేసింది.

Also Read:  Amaravati : అమరావతికి గుడ్ న్యూస్