Formula E Car Race Case : తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ అయింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు వెల్లడించే వరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని తెలిపారు. ఈరోజు కేటీఆర్ పిటిషన్‌పై ఇప్పటికే ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. అందులో కేసుకు సంబంధించి పలు అంశాలు పేర్కొన్న ఏసీబీ, నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు తెలిపింది.
అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు పెట్టినట్లు పేర్కొంది. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్‌పై కేసు నమోదు చేశామనని ఏసీబీ తెలిపింది. ఫార్ములా-ఈ ఆపరేషన్స్ సంస్థను ఎఫ్ఐఆర్లో చేర్చారా అని అడిగిన హైకోర్టు, ఇందులో ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగిందని ప్రశ్నించింది. విదేశీ సంస్థకు పౌండ్ల రూపంలో రూ.46 కోట్లను చెల్లించారని, ఇందులో ఆర్బీఐ నిబంధనలను పాటించలేదని ఏసీబీ ఆరోపించింది. హెచ్ఎండీఏ నుంచి రూ.10 కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థికశాఖ అనుమతి ఉండాలన్న ఏసీబీ, ఎవరి అనుమతి లేకుండానే 54 కోట్లు చెల్లించారని కౌంటర్‌లో పేర్కొంది.
కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు లాయర్ సిద్దార్థ్ దావే వాదనలు వినిపించారు. కేటీఆర్ వేసిన కాష్ పిటిషన్ పై ఏసీబీ డీఎస్పీ కౌంటర్ దాఖలు చేశారు. కేటీఆర్ పై ఉన్న నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని కౌంటర్ లో ఏసీబీ కోరింది. అదే సమయంలో నాట్ టు టు అరెస్ట్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేటీఆర్ కూడా తన వాదనలు వినాలని కోరారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు కానీ ఇక్కడ ముందుగానే ఉన్న అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేసామమన్నారు. డబ్బులు చేరిన సంస్థ ను నిందితుడిగా చేర్చలేదని కేటీఆర్ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. విచారణ కొనసాగే క్రమంలో నిందితుడిగా చేర్చవచ్చు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ కేసులో 13(1)(a) సెక్షన్ అసలు వర్తించదని.. ఈ డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదన్నారు. విదేశీ సంస్థ తో అగ్రిమెంట్ చేసుకోవద్దు అని నిబంధన ఉంటే కేటీఆర్ తప్పు చేసినట్టు.. కానీ ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుందని కేటీఆర్ తరపు లాయర్ ప్రశ్నించారు.
Read Also: Kekius Maximus : ఎలాన్ మస్క్ పేరు ఇక ‘కేకియస్ మాక్సిమస్’.. ఎందుకు ?