Site icon HashtagU Telugu

Jubilee Hills Bypoll Results : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

Jublicounting

Jublicounting

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్ల లెక్కింపుని నిర్వహించేందుకు 42 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 186 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా, మొత్తం 109 పోస్టల్ బ్యాలెట్లలో 103 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈసారి పోలింగ్‌లో మొత్తం 1,94,631 మంది ఓటుహక్కు వినియోగించగా, 48.49% పోలింగ్ నమోదైంది. డివిజన్‌వారీగా చూస్తే బోరబండలో అత్యధికంగా 55.92% పోలింగ్ ఉండగా, సోమాజిగూడలో కనిష్టంగా 41.99% నమోదు కావడం ప్రత్యేకత.

‎Kidney Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు ప్రమాదంలో పడ్డట్టే.. జాగ్రత్త!

ఉపఎన్నిక కౌంటింగ్ 10 రౌండ్లలో జరుగుతుంది. ఒక్కో రౌండ్‌కు సుమారు 45 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నందున, మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వీవీప్యాట్ చీటీల లెక్కింపు లేదా ఏవైనా అభ్యంతరాలు తలెత్తితే మొత్తం ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు సాగవచ్చు. ఈవీఎంల సీల్లు అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తొలగించబడుతుండగా, ప్రతీ దశను వీడియో రికార్డింగ్ సహా కట్టుదిట్టమైన పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం లేకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి రౌండ్ అనంతరం ట్రెండ్‌ను ఈసీ వెబ్‌సైట్‌లో వెంటనే అప్‌డేట్ చేయనున్నారు.

‎Lord Shani: మీ జీవితంలో కూడా ఈ సంకేతాలు కనిపించాయా.. అయితే శనిదేవుడు మీపై కోపంగా ఉన్నట్లే!

ఈ ఉపఎన్నిక మరింత ప్రాధాన్యం సంతరించుకోవడానికి కారణం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం. దీంతో అనివార్యంగా జరిగిన ఈ ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి ప్రధాన ప్రత్యర్థులుగా నిలుస్తున్నారు. పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం చూపగా, కొన్ని సర్వేలలో బీఆర్ఎస్ వైపు అనుకూల ధోరణి కనిపించింది. 2009లో స్థాపించబడిన ఈ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన మాగంటి గోపినాథ్ గారి మరణంతో ఏర్పడిన ఖాళీ ఎవరు భర్తీ చేస్తారన్న ఉత్కంఠ కొన్ని గంటల్లో ముగియనుంది.

Exit mobile version