Gaddar Awards : గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా ప్రముఖ నటి జయసుధ ఎంపికయ్యారు. ఆమె ఆధ్వర్యంలో 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. గద్దర్ అవార్డుల కోసం వచ్చిన నామినేషన్లను ఈ నెల 21వ తేదీ నుంచి జ్యూరీ పరిశీలించనుంది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వచ్చాయి. వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరిల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్ 21 నుంచి అప్లికేషన్స్ వచ్చిన చిత్రాల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్న సమయంలో నంది అవార్డుల వేడుక జరిగేది. అయితే ఇది దశాబ్దం కిందటే ఆగిపోయింది. దాని స్థానంలో గద్దర్ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ ఏడాదే తొలిసారిగా ఈ పురస్కారాల వేడుక జరగనుంది.
Also Read :Indian Railways : 172వ వసంతంలోకి భారత రైల్వే.. చారిత్రక విశేషాలివీ
జయసుధకు దిల్‍రాజు కీలక సూచనలు
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా జయసుధ(Gaddar Awards) ఎంపికైన అనంతరం.. ఆమెతో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‍డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్‍రాజు సమావేశమయ్యారు. అవార్డుల కోసం వచ్చిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జయసుధకు ఆయన సూచించారు. ఎంపిక ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కోరారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను ఇస్తున్న విషయాన్ని దిల్ రాజు గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డులకు ఇంతటి స్పందన రాలేదని, ఈసారి గద్దర్ అవార్డులకు భారీగా దరఖాస్తులు వచ్చాయన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ప్రోత్సాహకంగా గద్దర్ అవార్డులను అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్ నుంచి 2023 డిసెంబరు వరకు విడుదలైన సినిమాలకు ఈ ఏడాది అవార్డులు ఇవ్వనున్నారు.