తెలంగాణ 12వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ఈ నెలలోనే TGPSC ద్వారా ఇంజనీరింగ్, విద్యా, అటవీ, టౌన్ ప్లానింగ్ శాఖల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తమ 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 67 వేల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశామన్నారు. రూ. 20,616 కోట్ల రుణమాఫీతో 25 లక్షల మంది రైతులను రుణవిముక్తులను చేశామని, మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవం వేళ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో ఇకపై నిరంతరం కొలువుల జాతర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అత్యంత పారదర్శక విధానంలో 67 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించిన సీఎం.. ఈ నెలలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరిన్ని కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయని ప్రకటించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, కాలుష్య నియంత్రణ మండలి (PCB), అటవీశాఖ, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్లు ఇస్తామని, అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ భావోద్వేగంతో ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఈ 30 నెలల కాలంలో సాధించిన ప్రగతిని, అమలు చేసిన సంక్షేమ పథకాల విజయాలను ప్రజల ముందుంచారు. దశాబ్దాల తెలంగాణ కల సాకారం కావడానికి నాడు అచంచల నిర్ణయం తీసుకున్న యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది’ అన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు మాటలను గుర్తుచేస్తూ.. ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర హితం కోసం రాత్రింబగళ్లు శ్రమిస్తున్నామని చెప్పారు.
అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదన్న సత్యాన్ని తాము నమ్ముతామని, రాచరికాన్ని లేదా కొందరి పెత్తనాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ సహించదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వమంటే నలుగురి చేతుల్లో ఉండే పవర్ కాదని, ప్రజల ఆశలను నెరవేర్చే వేదిక అని అన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ ఇప్పటికే 1,362 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించామని, అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందిస్తూ.. జూనియర్ కాలేజీ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించామని గుర్తుచేశారు.
రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ.. అన్నదాతలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ విజన్ 2047 ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో రైతుకు రూ. 2 లక్షల చొప్పున.. మొత్తం రూ. 20,616 కోట్ల రుణమాఫీ చేసి 25 లక్షల మంది రైతులను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించామని వివరించారు. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ. 27,529 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూనే సౌరశక్తి పంప్‌సెట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో 2025-26 నాటికి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి నమోదవుతుందని సగర్వంగా ప్రకటించారు. దీంతో పాటు రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
